జమిలి సాధ్యాసాధ్యాలు.. లాభ నష్టాలు.. ఒక పరిశీలన! | ome nation one election merits and demerits| study| national| local| problems| priorities
posted on Sep 7, 2023 11:53AM
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు అంటే సెప్టెంబర్ 22 వరకూ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకున్న నూతన పార్లమెంటు భవనంలో ఈ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి. నూతన పార్లమెంటు భవనంలో6 పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగడం ఒక విశేషమే కానీ.. ఈ ప్రత్యేక సమావేశాలలో అజెండా ఏమిటన్నదానిపై ఇంత వరకూ స్పష్టత లేదు.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ ఈ విషయాన్నే ఎత్తి చూపుతూ విపక్షాలు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో ఏ ఎంజెండా ఉండాలని భావిస్తున్నాయో తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆ సంగతి పక్కన పెడితే ఎలాంటి ఎజెండా ప్రకటించకుండా కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు తేదీలు ప్రకటించేయడం దేశ వ్యాప్తంగా విస్తృత చర్చకు దారి తీసింది. కేంద్రం ముఖ్యంగా మూడు అంశాలు టార్గెట్ గా ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాటిలో ప్రధానంగా జమిలి ఎన్నికలు, ఇండియా పేరును ఎరాడికేట్ చేసి ఇక నుంచి అన్ని భాషలలోనూ దేశాన్ని భారత్ అని మాత్రమే సంబోధించాలన్న తీర్మానం చేయడం, మహిళా బిల్లు అని చెబుతున్నారు. వీటిలో మహిళా బిల్లు విషయంలో కేంద్రానికి పెద్ద పట్టింపు ఉందని ఎవరూ భావించడం లేదు. కానీ జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు విషయాలను కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు, వాటి విషయంలో తన పంతం నెగ్గించుకోవాలన్న పట్టుదలను కూడా ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు.
ముఖ్యంగా ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నది గత ఐదేళ్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక నినాదంగా ప్రచారంలోకి తీసుకు వచ్చింది. వాస్తవానికి జమిలి ఎన్నికలు అన్నది ఏదో కొత్తగా మోడీ సర్కార్ మెదడులోంచి పుట్టుకొచ్చిన వినూత్న ఆలోచనేం కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి రెండు సార్వత్రిక ఎన్నికలూ జమిలి ఎన్నికలే. అప్పట్లో పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకూ ఒకే సారి ఎన్నికలు జరిగాయి. అయితే ఆ తరువాతే కేంద్రంలోనో, రాష్ట్రాలలోనో తలెత్తిన రాజకీయ పరిణామాల కారణంగా మధ్యంతర ఎన్నికలు అనివార్యం కావడంతో జమిలి ఎన్నికలు జరపలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచీ రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలం ముగిసిన తరువాత అసెంబ్లీ ఎన్నికలూ, ఆ తరువాత పార్లమెంటు గడువు మిగిసిన తరువాత పార్లమెంటు ఎన్నికలు నిర్వహించడం రివాజుగా మారిపోయింది.
అంటే ఆచరణలో దేశంలోని అన్ని రాష్ట్రాలకూ, పార్లమెంటుకూ ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమన్న సంగతి పదే పదే రుజువైంది. కానీ కేంద్రంలోని మోడీ సర్కార్ మాత్రం జమిలి ఎన్నికల వల్ల పలు ప్రయోజనాలున్నాయనీ గత ఐదేళ్లుగా ప్రచారం చేస్తూనే ఉంది. వాటి నిర్వహణ కోసం చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. మోడీ సర్కార్ జమిలి వల్ల ప్రయోజనాలు అంటూ చెబుతున్న అంశాలు కూడా కొత్తవేమీ కాదు. ప్రజాధనం వృధాను అరికట్టడం, శాంతి భద్రతల సమస్య తలెత్తకపోవడం, అన్నిటికీ మించి ఏడాది పొడవునా ఎన్నికలు జరిగే పరిస్థితిని నివారించడం తద్వారా.. ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగే పరిస్థితి ఏర్పడుతుందన్నది మోడీ సర్కార్ వాదన. ఇందుకోసం ఒకే దేశం ఒకే ఎన్నిక సాధ్యాసాధ్యాల అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదికను ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలోనే చర్చించి నిర్ణయం తీసుకునే దిశగా మోడీ సర్కార్ అడుగులు వేస్తున్నది.
కాగా మోడీ సర్కార్ జమిలి వల్ల ప్రయోజనాలను ఏకరవు పెడుతుంటే.. నిపుణులు జమిలి కారణంగా ఎదురయ్యే నష్టాలను వివరిస్తున్నారు. జమిలి ఎన్నికల వల్ల జాతీయ సమస్యలు, ప్రాంతీయ సమస్యలూ ఓవర్ ల్యాప్ అవుతాయని… ఓటర్ కన్ఫ్యూజ్ అవుతారనీ, అన్నిటికీ మించి ప్రాంతీయ పార్టీల ఉనికికి, మనుగడకు జమిలి ఎన్నికలు తీరని నష్టం చేకూరుస్తాయనీ వివరిస్తున్నారు. దేశంలో 3800 పైగా ఉన్న ఎమ్మెల్యే స్థానాల ఎన్నికలు ప్రధానంగా స్థానిక అంశాల పైన ఆధారపడి ఉంటాయి. దానికి విరుద్ధంగా 543 ఎంపీ స్థానాల లోక్ సభ ఎన్నికల ప్రక్రియ దేశ పరిస్థితులు పైన ఆధారపడి ఉంటాయి.
ఈ రెండు ఎన్నికలు అలాగే స్థానిక ఎన్నికలు ఒకేసారి జరపడం ద్వారా అభ్యర్థులతో పాటు ప్రజలు కూడా అయోమయంలో పడే పరిస్థితి లేకపోలేదని అంటున్నారు. అన్నిటికీ మించి జమిలి ఎన్నికల వల్ల రాష్ట్రాల ప్రాధాన్యతాంశాలు మరుగున పడిపోతాయనీ, దీని వల్ల కేంద్ర లబ్ధి పొందడమే కాకుండా.. ఫెడరల్ స్ఫూర్తికి భంగం వాటిల్లుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కేంద్రంలోని మోడీ సర్కార్ చాలా వరకూ రాష్ట్రాల అధికారాలను తగ్గించేసిందనీ, ముఖ్యంగా ఢిల్లీ వంటి రాష్ట్రాలలో ఉద్యోగుల నియామకాలు కూడా కేంద్రం అధీనంలోకి తెచ్చేసుకుందనీ, జమిలి ఎన్నికల ఆచరణలోకి వస్తే మిగిలిన రాష్ట్రాల పరిస్థితి కూడా అంతే అవుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.