Leading News Portal in Telugu

COVID-19: కోవిడ్ చికిత్స తరువాత చిన్నారి కళ్ల రంగు మారింది..


COVID-19: గత మూడేళ్లుగా కోవిడ్-19 ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. తన రూపాన్ని మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నా కూడా పూర్తిస్థాయిలో కంట్రోల్ కావడం లేదు. ఇదిలా ఉంటే కోవడ్ సోకిన వారిని దీర్ఘకాలం సైడ్ ఎఫెక్టులతో బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే థాయ్‌లాండ్ లో కోవిడ్ చికిత్స తర్వాత ఓ చిన్నారి కళ్ల రంగు పూర్తిగా మారిపోయింది.

మెడికల్ సైడ్ ఎఫెక్ట్స్ లో అసాధారణ సందర్బాల్లో మాత్రమే ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణ కోవిడ్ చికిత్స పొందిన తర్వాత 6 నెలల బాలుడి డార్క్ బ్రౌన్(ముదురు గోధుమ) రంగు కళ్లు బ్లూ(నీలం)గా మారాయి. మెడికల్ జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ పీడియాట్రిక్స్ ప్రకారం.. థాయ్‌లాండ్ కి చెందిన బాలుడు ఒక రోజు జ్వరం, దగ్గులో బాధపడుతుంటే పరీక్ష చేయగా కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. చికిత్స కోసం :ఫావిపిరావిర్ అనే మందును వాడారు. ఆ తరువాత శిశువు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. కాగా ఈ ఔషధాన్ని ఇచ్చిన 18 గంటల తర్వాత పిల్లాడి కంటి రంగు మారడాన్ని తల్లి గమనించింది. డార్క్ బ్రౌన్ ఐస్, బ్లూ కలర్ లోకి మారాయి.

అయితే ఫావిపిరావిర్ ఆపేసిన 5 రోజుల తర్వాత బాలుడి అసలు కళ్ల రంగులోకి వచ్చాయి. ఈ మార్పు తర్వాత చికిత్సను ఆపేసినట్లు వైద్యులు తెలిపారు. చర్మం, గోళ్లు, నోరు, ముక్కు శ్లేష్మం వంటి ప్రాంతాల్లో నీలిరంగులోకి మారడం కనిపించలేదు. ఫావిపిరావిర్ థెరపీ ఆపేసిన తర్వాత లక్షణాలు మెరుగయ్యాయి. కార్నియా రంగు మళ్లీ మామూలు స్థితిలోకి వచ్చింది. 2022లో థాయ్‌లాండ్ ప్రజారోగ్య మంత్రిత్వశాఖ కోవిడ్-19 తేలికపాటి లక్షణాలు ఉన్న పిల్లల చికిత్స కోసం యాంటివైరల్ ఔషధం ఫావిపిరావిర్ ని ఉపయోగించాలని ఆదేశించింది. 2021లో భారత్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 20 ఏళ్ల వ్యక్తికి చికిత్స చేస్తుండగా.. సైడ్ ఎఫెక్ట్ మూలంగా అతని కళ్లు కూడా నీలం రంగులోకి మారాయి.