R Ashwin hails Ishan Kishan’s Batting ahead of ODI World Cup 2023: అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. భారత జట్టులో చోటు ఆశించిన చాలా మంది ఆటగాళ్లకు నిరాశ తప్పలేదు. ఇందులో కేరళ వికెట్ కీపర్ సంజు శాంసన్ కూడా ఉన్నాడు.
గాయపడి కోలుకున్న స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు వన్డే ప్రపంచకప్ 2023లో ఆడే భారత జట్టులో చోటు దక్కింది. అతడికి బ్యాకప్ వికెట్ కీపర్‌గా యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌ను తీసుకున్నారు. ఇషాన్ వైపు మొగ్గు చూపిన సెలక్టర్లు.. సంజు శాంసన్‌కు మొండిచేయి చూపారు. ఇషాన్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా తీసుకోవడంపై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు. ఇషాన్ ‘టూ ఇన్ వన్’ ప్లేయర్ అంటూ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఇషాన్, సంజు మధ్య పోటీ లేదని యాష్ పేర్కొన్నాడు.
ఆర్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ… ‘సంజు శాంసన్, ఇషాన్ కిషన్ మధ్య అసలు పోటీ లేదు. ఇషాన్ చాలా పాత్రలను పోషిస్తాడు. ప్రపంచకప్‌కు జట్టును ఎంచుకున్నప్పుడు బ్యాకప్ వికెట్ కీపర్ అవసరం. ఇషాన్ టూ ఇన్ వన్ ప్లేయర్. బ్యాకప్ ఓపెనర్ మాత్రమే కాదు.. బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానానికి కూడా బ్యాకప్‌గా ఉన్నాడు. ఐదో స్థానంలో బరిలోకి దిగి మంచి స్కోర్లు సాధించే సత్తా అతడికి ఉంది. ఇషాన్ నిస్వార్థ ఆటగాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తాడు. అవకాశం వస్తే ప్రపంచకప్‌లో కచ్చితంగా రాణిస్తాడు’ అని ధీమా వ్యక్తం చేశాడు.