Leading News Portal in Telugu

Love Marriage: కుమార్తె కులాంతర ప్రేమ వివాహం.. దగ్గరుండి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే


Love Marriage: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన మొదటి కుమార్తె పల్లవికి ప్రేమ వివాహం జరిపించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఆదర్శవంతంగా నిలిచింది. తన కూతురు వివాహాన్ని పవన్ అనే యువకుడితో సంప్రదాయబద్ధంగా బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో నిర్వహించారు. అనంతరం ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయానికి తీసుకెళ్లి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దగ్గరుండి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు. కన్న కూతురు వివాహాన్ని నిరాడంబరంగా జరిపించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ.. తాను నిరాడంబరంగా తన మొదటి కుమార్తె పల్లవి ప్రేమ, కులాంతర వివాహానికి ఒప్పుకుని ఆశీర్వదించానన్నారు. కలిసి చదువుకున్న రోజుల్లో ఇష్టపడటంతో పవన్‌తో పెళ్లి చేశామన్నారు. డబ్బు, హోదా, కులానికి విలువ ఇవ్వకుండా వారి ఇష్టప్రకారమే అంగీకరించి వివాహం చేశామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు