Leading News Portal in Telugu

విశాఖ జైల్లో మొద్దు ‘సీన్’?! | kodi katti case adjourn| jagan| victim| court| advocate| botsa| relative| knife| ycp| leaders| vizag


posted on Sep 7, 2023 3:15PM

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా  2019 ఎన్నికల ముందు   అప్పటి  ప్రతిపక్షనేత   జగన్‌పై కోడికత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ.. దాదాపు నాలుగున్నరేళ్లుగా జైల్లో ఉన్న కోడికత్తి శ్రీను ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే ఓచర్చ పోలిటికల్ సర్కిల్‌‌లో సాగుతోంది.  కోడి కత్తి దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ కుమారుడిని బెయిల్‌పై విడిపించాలంటూ కొడికత్తి శ్రీను తల్లిదండ్రులు ఇప్పటికే పలుమార్లు   జగన్ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొన్నారు.  అలాగే ఈ అంశంపై సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి   వారు స్వయంగా వెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ విషయాలన్నిటిపైనా రాజకీయ పరిశీలకులు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. బాధితుడిగా కోర్టుకు హాజరు కావడానికి జగన్ ఎందుకు ఇష్టపడటం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. 

మరోవైపు.. కోడికత్తి శ్రీను కూడా మొద్దు శ్రీనులాగానే హత్యకు గురయ్యే అవకాశాలు ఉన్నాయా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య చేసిన మొద్దు శ్రీను..  ఆ తర్వాత అనంతపురం జైల్లో శిక్ష అనుభవిస్తూ… అదే  జైల్లో ఉన్న ఓం ప్రకాశ్ చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి రాజకీయ వర్గాల చర్చల్లో  ప్రస్తావనకు వస్తోంది. అదే తరహాలో కోడికత్తి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జనపల్లి శ్రీను  సైతం జైల్లోనే హత్యకు గురయ్యే అవకాశాలు ఉన్నాయన్న అనుమానం ఆ చర్చల్లో బలంగా వ్యక్తమౌతోంది.

మరోవైపు బుధవారం(సెప్టెంబర్ 6)  విశాఖపట్నం కోర్టు వద్ద ఈ కేసులో నిందితుడి తరఫు న్యాయవాది అబ్దుల్ సలీం మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు   జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని చెప్పిన రోజు.. వైసీపీ నేతలు తప్పించి మరెవరూ  ప్రత్యక్ష సాక్షులుగా (ఐ విట్నెస్‌లు) లేరని,  అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్, సెక్యూరిటీ అధికారులు.. తాము ఈ దాడిని చూడలేదని చెప్పారన్నారు.  

ఆయితే ఆ రోజు కోడికత్తి బొత్స సత్యనారాయణ సమీప బంధువు మజ్జి శ్రీను వద్ద మాత్రమే ఉందని… ఏపీ పోలీసుల మీద నమ్మకం  లేదంటూ మందుగా కోడికత్తి సమర్పించలేదన్నారు. ఈ కేసులో కర్మ కర్త క్రియా అన్నీ మజ్జి శ్రీనివాసేనని కోడికత్తి శ్రీను తరఫు న్యాయవాది ఆరోపించారు. ఆ సమయంలో మజ్జి శ్రీను.. తన పోనును పోలీసులు అడిగితే.. ఎందుకు డిపాజిట్ చేయలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఉద్దేశపూర్వకంగానే జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీనుపై కేసుపెట్టారన్నారు. ఇందుకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయని.. వాటిని సమయం వచ్చినప్పుడు బయట పెడతానని అబ్దుల్ సలీం స్పష్టం చేశారు. 

 హరీశ్ సాల్వే వివాహానికి హాజరయ్యేందుకు లండన్ కు వెళ్లే తీరిక ఉన్న జగన్ కు.. కోడికత్తి కేసులో బాధితుడిగా విశాఖకు వచ్చే పాటి తీరిక లేకుండా పోయిందా అని ప్రశ్నించారు. ఒక ఎస్సీ యువకుడు నాలుగున్నరేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నా? తనపైనా దాడి జరిగిందని స్వయంగా ఫిర్యాదు చేసి పట్టుబట్టి మరీ  ఎన్ఐఏ దర్యాప్తును సాధించుకున్న జగన్ బాధితుడిగా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వకుండా ఉండటం ఎంత మాత్రం సరికాదని ఆయన పేర్కొన్నారు.  జగన్ పై కోడికత్తి దాడి జరిగినప్పుడు జనుపల్లి శ్రీనివాస్ ఫుడ్ కోర్టులో అనుమతితోనే పని చేస్తున్నాడని అయితే ఆ రోజు  ఐదుగురు వైసీపీ నేతలు పాస్‌లు లేకుండానే  విమానాశ్రయంలోకి ప్రవేశించిన విషయాన్ని కోర్టు ముందుంచామని చెప్పారు.  అలాగే కోడికత్తి దాడి జరిగిన రోజు.. పోలీస్ స్ట్రైకింగ్ ఫోర్స్ జీపుపై  దాడి చేసిన వైసీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.  

2023 ఆగస్ట్ వరకు విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి దాడి కేసు విచారణ జరిగింది. ఇటీవలే  ఆ కేసును విశాఖకు బదిలీ చేశారు. ఆ క్రమంలో కోడికత్తి శీను  ఇన్నాళ్లు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి  ప్రతీ వాయిదాకు  విశాఖకు తీసుకు రావడం కష్టమన్న ఉద్దేశంతో అతడిని  విశాఖ సెంట్రల్ జైలుకు తరలించాలని కోర్టును ఎన్ఐఏ  అభ్యర్థనను కోర్టు అంగీకరించడంతో . కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావును విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇంకోవైపు.. విశాఖ సెంట్రల్ జైల్లో ఇటీవల మత్తు పదార్థాల కలకలం సృష్టించిన విషయం విదితమే. 

కోడికత్తి కేసు ఏళ్ల తరబడి ముందుకు సాగకపోవడం ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం వైయస్ జగన్ కోర్టుకు హాజరు కాకపోవడం చూస్తుంటే.. పరిటాల రవి హత్య కేసులో జరిగిన విధంగానే  మొద్దు శ్రీను సీను విశాఖ జైల్లో రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు విశ్లేషకులు.