Leading News Portal in Telugu

World Cup 2023: ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్‌పై వేటు.. టీమిండియా కొత్త కోచ్‌ ఎవరంటే?


Ashish Nehra To Become India Head Coach After Rahul Dravid: బీసీసీఐతో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల ఒప్పందం ప్రపంచకప్ 2023 అనంతరం ముగియనుంది. ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధిస్తే.. మరోసారి ద్రవిడ్‌ని హెడ్ కోచ్ పదవిలో కొనసాగిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవేళ భారత్ టైటిల్ గెలువకుంటే.. ద్రవిడ్‌పై ఆ ప్రభావం కచ్చితంగా పడుతుంది. ఎందుకంటే అండర్-19లో మాదిరి అంతర్జాతీయ క్రికెట్‌లో ‘ది వాల్’ ఇప్పటివరకు తనదైన ముద్ర వేయలేదు. ఒక్క మేజర్ టోర్నీలో కూడా భారత్ విజేతగా నిలవలేదు.

ప్రపంచకప్ 2023లో భారత్ సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇది హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ విజయంగా పరిగణించబడదు. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ కొత్త కోచ్ కోసం వెతకవచ్చు. ఐపీఎల్‌లో విజయవంతమైనందున భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా టీమిండియా కోచ్‌గా మారడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే గుజరాత్ టైటాన్స్‌తో ఒప్పందం ఉన్న కారణంగా జాతీయ జట్టుకు కోచ్‌గా మారడానికి నెహ్రా ఆసక్తి చూపుతాడో లేదో. ఇక టీమిండియా అత్యుత్తమ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కోచ్‌గా రావాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అతడికి ఆసక్తి ఉంటే మహీ రంగంలోకి దిగినా ఆశ్చర్యం లేదు.

ప్రపంచకప్ 2023 తర్వాత ఇంగ్లండ్‌ మాదిరి టెస్ట్, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లకు వేర్వేరు కోచ్‌లను బీసీసీఐ నియమించినా ఆశ్చర్యం లేదు. అన్ని ఫార్మాట్‌లకు ప్రత్యేక కోచ్‌లను కలిగి ఉండాలని ఇప్పటికే అంతా భావిస్తున్నారు. అదే జరిగితే టెస్టు జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను కొనసాగించి.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లకు మరొకరు ఉండనున్నారు. మరి ప్రపంచకప్ తర్వాత బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. నాలుగేళ్ల పాటు హెడ్ కోచ్‌గా కొనసాగిన రవిశాస్త్రి స్థానంలో ప్రధాన కోచ్‌గా ద్రవిడ్‌ వచ్చిన విషయం తెలిసిందే.

టీ20 ప్రపంచకప్‌ 2021లో భారత జట్టు నిరాశజనక ప్రదర్శన అనంతరం రవిశాస్త్రి హెడ్‌కోచ్‌ బాధ్యతల నుంచి వైదొలిగాడు. అనేక చర్చల అనంతరం రాహుల్‌ ద్రవిడ్‌ను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఒప్పించి హెడ్‌ కోచ్‌గా నియమించాడు. 2021 నవంబరులో బాధ్యతలు స్వీకరించిన ద్రవిడ్‌.. రోహిత్‌ శర్మతో కలిసి పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుస విజయాలు అందించాడు. అయితే ఆసియా కప్‌ 2022, టీ20 ప్రపంచకప్‌ 2022 సహా టెస్టు చాంపియన్‌షిప్‌-2023 ఫైనల్లోనూ భారత్ ఓడిపోవడం ద్రవిడ్‌కు మచ్చగా మారింది. ద్రవిడ్‌ను తొలగించాలనే డిమాండ్లు చాలాసార్లు తెరపైకి వచ్చాయి.