posted on Sep 7, 2023 3:09PM
ఈటల రాజేందర్ బీజేపీలో ఇమడ లేకపోతున్నారా? అసలు ఆయన టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కమలం గూటికి చేరినప్పుడే ఆయన గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఆ పార్టీలో ఆయన ఎక్కువకాలం ఇమడలేరని జోస్యాలు చెప్పారు. అసలు వామపక్ష భావజాలం ఉన్న ఈటల చేరితే కాంగ్రెస్ లో చేరాలి.. అందుకు భిన్నంగా బీజేపీలో ఎందుకు చేరారన్న సందేహాలు అప్పట్లోనే రాజకీయ వర్గాలలో, పరిశీలకులలో వ్యక్తం అయ్యాయి.
అయితే ఇప్పటి దాకా బీజేపీలో ఉక్కపోతకు గురైనా ఈటల మాత్రం సంయమనంతో సర్దుకుని ఉన్నారు. బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ తో విభేదాలను రచ్చ చేయకుండా అధిష్ఠానంతో మాట్లాడుకుని చక్కదిద్దుకున్నారు. అసలు బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం వెనుక ఈటలను సంతృప్తి పరిచే ఉద్దేశమే ఉందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషణలు చేశారు. సరే బండి సంజయ్ స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. బీజేపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో చేరికల కమిటీని ఏర్పాటు చేసిన బీజేపీ ఆ కమిటీకి చైర్మన్ గా ఈటలను నియమించింది. ఈటల ఆధ్వర్యంలో బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయనీ… ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయనీ అంతా ఆశించారు. అదలా ఉంటే బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల నియామకానికి ముందు పార్టీలో ఈటలకు చాలా చాలా అవమానాలు ఎదురయ్యాయని చెబుతారు. కానీ ఈటల బీజేపీలో చేరిన క్షణం నుంచి రాష్ట్రంలో ఆ పార్టీ నిర్వహించిన అన్ని కార్యక్రమాలలోనూ భాగస్వామిని చేయడం, అమిత్ షా, మోడీ వంటి అగ్రనేతల సభలలో కూడా వేదికపై ఆసనం ఇవ్వడంతో ఈటలకు బీజేపీలో ఉక్కపోత అన్న వార్తలు వదంతులేనా అన్న భావన కూడా సర్వత్రా కలిగింది.
అయితే బండితో విభేదాలు ఉన్నప్పటికీ ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం పార్టీలో ఈటల గౌరవానికి ఎటువంటి భంగం వాటిల్లలేదు. కానీ కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత మాత్రం ఉద్దేశ పూర్వకంగా ఈటలను తక్కువ చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయని ఈటల సన్నిహితులు అంటున్నారు. ముఖ్యంగా చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న తాను పార్టీలోకి చేరికల కోసం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగడాన్ని ఈటల సహించలేకపోతున్నారని అంటున్నారు. తాజాగా మాజీ మంత్రి కృష్ణయాదవ్ పార్టీలో చేరిక చివరి క్షణంలో ఆగిపోవడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కారణమని అంటున్నారు. దీనితో ఈటల ఇక పార్టీలోకి చేరికల విషయంలో ఎటువంటి ప్రయత్నాలూ చేయడం లేదని అంటున్నారు. అలాగే.. ఈటల ద్వారా పార్టీలోకి స్పష్టమైన హామీతో చేరిన తుల ఉమ వంటి వారికి పోటీగా ఇతరులను తీసుకురావడం వంటి ఘటనలతో ఈటల పార్టీ వ్యవహారాలలో పెద్దగా పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.
అదే విధంగా అమిత్ షా ఇటీవల ఖమ్మం వచ్చారు. ఆ సభావేదికపై బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీలోకి చేరికలు ఉంటాయన్న ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ నేతలతో తన సంబంధాలను ఉపయోగించుకుని అక్కడ అసంతృప్తులను ఈటల బీజేపీలో చేరుస్తారని బీజేపీ హైకమాండ్ కూడా భావించింది. అయితే ఈటల మాత్రం తాను పార్టీలోకి తీసుకువచ్చిన వారికీ, తన ద్వారా వద్దామనుకున్న వారికీ వెల్ కమ్ అంతంత మాత్రంగా ఉండటంతో చేరికల విషయంలో పెద్దగా శ్రద్ధ తీసుకోవడం లేదని బీజేపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈటల అసంతృప్తిని పార్టీ హైకమాండ్ కూడా లైట్ గా తీసుకుంటోందనీ అంటున్నారు. దీంతో బీజేపీ తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మారిపోయింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఎవరికి వారు తమ వర్గం పైచేయిగా ఉంటే చాలన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో తెలంగాణ బీజేపీ పరిస్థితు మూడు గ్రూపులూ ఆరు వర్గాలు అన్నట్లుగా తయారైంది.