Leading News Portal in Telugu

Leopard Trapped in Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత.. ఇక భయం తొలిగినట్టేనా..?


Leopard Trapped in Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఆపరేషన్‌ చిరుత కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే నాలుగు చిరుతలను బంధించిన అటవీశాఖ అధికారులు.. తాజాగా మరో చిరుత ఫారెస్ట్‌ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది.. దీంతో ఇప్పటి వరకు తిరుమలలో చిక్కిన చిరుతల సంఖ్య ఐదుకు చేరింది.. అయితే, తిరుపతి నుంచి కాలి నడక తిరుమలలో వెళ్లే భక్తులు ఈ మధ్య భయంతో వణికిపోతున్నారు.. ఓ బాలుడిపై చిరుత దాడి చేయడం.. ఆ బాలుడు ప్రాణాలతో భయటపడినా.. కొద్ది రోజుల తర్వాత చిరుత దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర కలకలం రేగింది.. అయితే, కాలి బాటలో తిరుమల వెళ్లే భక్తులకు రక్షణ కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.. అటవీ శాఖ అధికారులతో కలిసి చేపట్టిన ఆపరేషన్ చిరుత సతల్ఫితాన్ని ఇస్తోంది. తాజాగా మరో చిరుత పులిని బంధించారు అధికారులు. దీంతో.. మూడు నెలల వ్యవధిలో బోనులో చిక్కిన చిరుతల సంఖ్య ఐదుకు చేరింది.

తిరుమల నడకదారిలో నరశింహస్వామి ఆలయం.. ఏడో మైలు మధ్య ప్రాంతంలో చిరుతని ట్రాప్ చేశారు అటవీశాఖ అధికారులు.. ఐదో చిరుత కూడా మగ చిరుతగానే భావిస్తున్నారు ఫారెస్ట్‌ అధికారులు.. అయితే, నాలుగు రోజుల క్రితమే అధికారులకు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరా ద్వారా చిరుత సంచారాన్ని గుర్తించారు.. వెంటనే బోన్లు ఏర్పాటు చేసి చిరుతను బంధించారు. 4 రోజుల కిందట ట్రాప్‌ కెమెరాల్లో దాని సంచారాన్ని అధికారులు గుర్తించి.. బోను ఏర్పాటు చేయగా.. ఎట్టకేలకు నిన్న రాత్రి అది ట్రాప్‌లో చిక్కింది. అయితే, తిరుమలలో ‘ఆపరేషన్​ చిరుత’ కొనసాగుతుందని చెబుతున్నారు అధికారులు.. ఇప్పటి వరకు ఐదు చిక్కినా.. మిగిలిన వాటి కోసం అన్వేషణ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నమాట.. అయితే, ఇప్పటికే ఐదు చిరుతలు చిక్కడంతో.. ఇక, నడకదారిలో పెద్దగా ఇబ్బందులు ఉండవనే చర్చ కూడా సాగుతోంది. కాగా, జూన్‌ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28 తేద్దీల్లో చిరుతను బంధించిన అటవీశాఖ అధికారులు.. తాజాగా అంటే సెప్టెంబర్‌ 6వ తేదీన ఐదో చిరుతను కూడా బంధించగలిగారు.