BJP-JDS alliance: కర్ణాటకలో కొత్త రాజకీయ సమీకరణం తెరపైకి వచ్చింది. పాత మిత్రుడు జేడీఎస్, బీజేపీ పంచన చేరబోతోంది. ఈ ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ దారుణం దెబ్బతింది. బీజేపీ ఓట్ షేర్ అలాగే ఉన్నా.. జేడీఎస్ ఓట్ షేర్ దారుణంగా పడిపోయింది. జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లడం ఆ పార్టీకి ప్రమాదఘంటికలు మోగించాయి. ఈ నేపథ్యంలో వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ రెండు పార్టీలు కర్ణాటకలో ఓట్లు చీలకుండా మెజారిటీ ఎంపీ స్థానాలు గెలిచేందుకు సిద్ధమవుతున్నాయి. సీట్ల పంపకాలను ప్రధాని మోడీ నిర్ణయిస్తారని తెలుస్తోంది.
ఈ మేరకు ఇప్పటికే జనతాదళ్ (సెక్యులర్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ ఇటీవల బీజేపీ అమిత్ షా, జేపీ నడ్డాలను కలిశారని, 2024 సార్వత్రిక ఎన్నికలకు ఐదు లోక్‌సభ స్థానాలను కోరారని తెలిసింది. మాండ్య, హాసన్, తుమకూరు, చిక్బల్లాపూర్, బెంగళూరు రూరల్ ఎంపీ స్థానాలను జేడీఎస్ అడుగున్నట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీతో పొత్తు ఉండదని జేడీఎస్ చీఫ్ దేవెగౌడ పలుమార్లు ప్రకటించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాలంటే బీజేపీతో పొత్తు చాలా అవసరం అని ఆ పార్టీ భావిస్తోంది. ఇటీవల కొత్త పార్లమెంట్ ఓపెనింగ్ సందర్భంలో పలు విపక్షాలు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోయినా.. దేవెగౌడ హాజరుకావడంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి.
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ముఖ్యంగా కింగ్ మేకర్ పొజిషన్ లో ఉండే జేడీఎస్ దారుణంగా దెబ్బతింది. ఆ పార్టీకి పట్టున్న మైసూర్ రీజియన్ లో కూడా చాలా స్థానాల్లో ఓడిపోయింది. చివరకు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ ఓడిపోయారు. ప్రస్తుతం జేడీఎస్ కి 19 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇదిలా ఉంటే రానున్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటక చాలా కీలకం. మొత్తం 28 లోక్ సభ స్థానాలు ఉంటే 2019 ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాల్లో గెలిచారు. జేడీ(ఎస్) కంచుకోట హాసన్‌లో దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ విజయం సాధించారు.