ఏపీలో బీజేపీ తటస్థం.. అసలు వ్యూహం ఏమిటంటే? | bjp neutral in ap| actual| strategy| mps| suppourt| general| ecections| ap
posted on Sep 8, 2023 11:34AM
కేంద్రంలోని మోడీ సర్కార్ అయితే జమిలి లేకుంటే మినీ జమిలి అని ఫిక్స్ అయిపోయినట్లే కనిపిస్తోంది. దీని ద్వారా రాజకీయంగా బోలెడు లబ్ధి ఉందని భావిస్తోంది. ప్రజా వ్యతిరేకతను తట్టుకుని ముచ్చటగా మూడో సారి కేంద్రంలో మోడీ సర్కార్ కొలువు దీరాలంటే ముందస్తే బెస్ట్ అని డిసైడైపోయినట్లు కనిపిస్తోంది. అదే జరిగితే రాష్ట్రాలలో జాతీయ అంశాలు, జాతీయ స్థాయిలో స్థానిక అంశాలు మిక్స్ అయిపోయి గట్టెక్కేయగలమన్నది మోడీ సర్కార్ భావనగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అంటే రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజాగ్రహం బీజేపీకి ఓట్ల రూపంలో లబ్ధి చేకూరుస్తుందని బీజేపీ భావిస్తోంది. మిగిలిన రాష్ట్రాలలో సంగతి ఎలా ఉన్నా ఏపీలో మాత్రం బీజేపీ వ్యూహాలు ఏవీ ఫలించేలా కనిపించడం లేదన్నది పరిశీలకుల విశ్లేషణ. సనాతన ధర్మం వివాదం, జమిలి ఎన్నికల నిర్ణయం ఇలా నేల విడిచి ఎన్ని సాములు చేసినా వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కు మూడో సారి అధికారంలోకి రావాలంటే చెమటోడ్చినా ఫలితం ఉంటుందా? ఉండదా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విపక్షాల ఐక్యతను దెబ్బ కొట్టైనా సరే అధికారం చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతున్నది. ఉత్తరాదిలో ఎలాగోలా పాస్ మార్కులు సంపాదించేసుకోగలమన్న ధీమాతో ఉన్న బీజేపీకి దక్షిణాది మాత్రం కొరుకుడు పడటం లేదు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన చేదు అనుభవం, ఆ తరువాత అప్పటి వరకూ అధికారమే తరువాయి అన్నట్లుగా కనిపించిన తెలంగాణలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోవడం.. చేరికల పేరిట బయట నుంచి తెచ్చుకున్న నాయకులకు.. తొలి నుంచీ పార్టీలోనే ఉన్న వారికి మధ్య పొరపచ్చాలతో మొదటికే మోసం అన్నట్లుగా తయారైన పరిస్థితి బీజేపీని గాభరాపెడుతున్నాయనడంలో సందేహం లేదు.
దీంతో దక్షిణాది రాష్ట్రాలలో అధికారం సంగతి తరువాత కనీసం ముందస్తు ఎత్తుతో ఆ రాష్ట్రాలలో కొన్న పార్లమెంటు స్థానాలనైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీరో అక్కౌంట్ ఉన్న ఏపీలో కనీసం కొన్ని ఎంపీ స్థానాలను దక్కించుకోవడం లేదా.. ఆ రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే పార్టీని తమ కూటమిలో చేర్చుకోవడం లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తున్నదని అంటున్నారు. అందులో భాగంగానే బీజేపీ బీజేపీలో తటస్థ వైఖరి అవలంబిస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికి శతధా ప్రయత్నిస్తున్నదని చెబుతున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూనే.. రాష్ట్రంలో మాత్రం ఢీ అంటే ఢీ అనేలా విమర్శలు గుప్పిస్తున్నది. కేంద్రంలో మోడీ సర్కార్ ఏపీ సర్కార్ విధానాలకు వత్తాసు పలుకుతుంటే.. అవే విధానాలను ఏపీ బీజేపీ ఎండగడుతోంది. ఇలా ద్వంద్వ ప్రమాణాలతో బీజేపీ ఏపీ ప్రజలను తాను రాష్ట్రంలో తటస్థంగా ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేస్తున్నది.
కేంద్రం నిబంధనలకు విరుద్ధంగా పరిమితిని మించి అప్పులు చేస్తున్నదని ఏపీ బీజేపీ విమర్శలు గుప్పించి గణాంకాలతో సహా వివరిస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం జగన్ సర్కార్ అలా నిబంధనలకు విరుద్ధంగా పరిమితిని మించి అప్పులు తీసుకోవడానికి అనుమతులు ఇస్తోంది. జమిలి పేర కేంద్రంలోని బీజేపీ సర్కార్ ముందస్తుకు వెళితే అప్పుడు సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇప్పటికే తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే 119 స్థానాలలోనూ పోటీలో ఉంటామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించేశారు. ఆయన ఈ ప్రకటన చేసే సమయానికి జమిలి ప్రస్తావన లేదు. అయితే ఇప్పడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరిగే అవకాశాలు కనిపిస్తుండటం.. అలా జరిగితే ఏపీలో పొత్తు, తెలంగాణలో పోరు అనే విధానం అంతిమంగా తెలుగుదేశం, బీజేపీలకు రెండు రాష్ట్రాలలోనూ నష్టం చేకూరుస్తుంది. అందుకే తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఏపీలో పోటీ చేసినా ఆ కూటమిలో బీజేపీ చేరే అవకాశాలు దాదాపు మృగ్యం. అంటే ఇటు ఏపీలోనూ, అటు తెలంగాణలోనూ కూడా బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
ఈ విధానం వల్ల ఏపీలో బీజేపీ స్వయంగా పార్లమెంటు స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఏమీ మెరుగు అవ్వవు. 2019 ఎన్నికలలో లాగే ఈ సారీ కూడా ఆ పార్టీ అటు ఏపీ అసెంబ్లీలో కానీ, ఇటు ఏపీ నుంచి లోక్ సభకు కానీ ఖాతా తెరిచే అవకాశాలు ఉండవు. అయితే బీజేపీ తన తటస్థ వైఖరి వల్ల ఎన్నికల తరువాత ఏపీలో అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న పార్టీని తన కూటమిలో చేర్చుకోవడం ద్వారా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎంపీల మద్దతును పొందేందుకు అవకాశాలను సజీవంగా ఉంచుకుంటోందని పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే ఒకే సమయంలో ఏపీలో అధికార, విపక్షాలకు తాను దగ్గరగా ఉన్నామన్న సంకేతాలను ఇస్తోంది. అందుకే బీజేపీ తెలుగు రాష్ట్రాలలో ఒకే సారి అసెంబ్లీ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నది. ఇరు రాష్ట్రాలలోనూ అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరిగితే.. జాతీయ స్థాయిలో మంచి పలుకుబడి ఉన్న చంద్రబాబు ఏపీలో ప్రచారానికే పరిమితమౌతారు. ఆయనకు తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశం పెద్దగా ఉండదు. దీంతో ఆయన ప్రచారం వల్ల తెలంగాణలో బీజేపీపై ప్రభావం పడే అవకాశాలు దాదాపుగా మృగ్యమైపోతాయి. దీంతో తెలంగాణలోని తెలుగుదేశం ఓటు బ్యాంకును బీజేపీ తన వైపునకు తిప్పుకునే అవకాశాలు మెరుగౌతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదే సమయంలో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి కేంద్రంలో బీజేపీ సర్కార్ ను టార్గెట్ చేసిన కేసీఆర్ కూడా జమిలి అనే సరికి పూర్తిగా తెలంగాణకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత సార్వత్రిక ఎన్నికలు జరుగుతాన్న ఉద్దేశంతోనే కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ హడావుడి చేశారు. ఎప్పుడైతే జమిలి ప్రతిపాదన తెరపైకి వచ్చిందో ఆయన మహారాష్ట్ర పర్యటనలు కూడా ఆగిపోయాయి. అభ్యర్థుల ఎంపిక, జాబితా ప్రకటన, అసంతృప్తులను బుజ్జగించడం, ఎన్నికల వ్యూహరచన, బీఆర్ఎస్ ను తెలంగాణలో మరోసారి అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రణాళికల రచన వీటితోనే ఆయనకు సరిపోతున్నది. దీంతో బీఆర్ఎస్ ప్రభావం దేశంలో మరే ప్రాంతంలోనూ ఇసుమంతైనా కనిపించడం లేదు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో ఒకే సారి ఎన్నికలు అన్న బీజేపీ వ్యూహం తెలంగాణలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ అనే చెప్పాలి. అదే సమయంలో ఏపీలో బీజేపీ తటస్థ వైఖరి అంతిమంగా వైసీపీ, తెలుగుదేశం పార్టీలలో ఎవరికి ప్రయోజనం చేకూరినా ఆ ఫలితం మాత్రం బీజేపీకి అనుకూలంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.