Leading News Portal in Telugu

iPhone Update: స్పైవేర్‌ను చొప్పించేందుకు హ్యాకర్ల యత్నం.. ఐఫోన్లకు అత్యవసర అప్‌డేట్‌!


iPhone users need to Apple update urgently: యాపిల్‌ కంపెనీ తమ ఐఫోన్‌ యూజర్లకు అత్యవసర సెక్యూరిటీ అప్‌డేట్‌లను రిలీజ్ చేసింది. హ్యాకర్లు ఐఫోన్‌లలోకి స్పైవేర్‌ను చొప్పించేందుకు అవకాశం ఉందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గుర్తించని కొన్ని లోపాలను ఉపయోగించుకొని.. హ్యాకర్లు ఐఫోన్‌లలోకి స్పైవేర్‌ను ప్రవేశపెట్టేందుకు యత్నించినట్లు యాపిల్‌ తెలిసింది. అప్రమత్తమైన యాపిల్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించింది.

సిటిజన్‌ ల్యాబ్‌ అనే ఇంటర్నెట్‌ వాచ్‌డాగ్‌ ఐఫోన్‌ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను గుర్తించి.. యాపిల్‌ కంపెనీకి తెలియజేసింది. వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సివిల్‌ సొసైటీ ఉద్యోగి ఫోన్‌లోకి పెగాసస్‌ అనే నిఘా సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించినట్లు సిటిజన్‌ ల్యాబ్‌ పరిశోధకులు గుర్తించారు. ఆ యూజర్‌ ఏమీ చేయకుండానే.. ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయ్యేలా మాల్వేర్‌ను చొప్పించాలని చూసినట్లు తెలిపింది. స్పైవేర్‌ యాక్టివేట్‌ అయితే.. యూజర్‌కు తెలియకుండానే కెమెరా ఆన్‌ కావడం, వాయిస్‌ రికార్డవ్వడం వంటివి వాటంతట అవే జరుగుతాయని పేర్కొంది.

ఐఫోన్‌లోని లోపాలను సిటిజన్‌ ల్యాబ్స్‌ ‘జీరో-డే-బగ్స్‌’గా పేర్కొంది. అంటే.. లోపాలను సరిదిద్దడానికి యాపిల్‌ కంపెనీ వద్ద కనీసం ఒక్కరోజు కూడా సమయం లేదని అర్థం. యాపిల్‌ ఈ లోపాలను వెంటనే సరిదిద్ది.. సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను తమ యూజర్లకు అందించింది. ఐఫోన్‌ వాడుతున్న వారు వెంటనే ఈ సెక్యూరిటీ అప్‌డేట్‌లను చేసుకోవడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు.