Leading News Portal in Telugu

World Cup 2023: మీ సలహాలు మాకు అవసరం లేదు.. విదేశీ మాజీ ఆటగాళ్లపై సన్నీ ఫైర్!


Sunil Gavaskar Shuts Down Pakistan, Australian Experts: భారత గడ్డపై అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టు ఎంపికపై పలువురు మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ మాజీ ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్ మండిపడ్డాడు. జట్టు ఎంపిక విషయంలో మీ సలహాలు మాకు అవసరం లేదంటూ పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా మాజీలపై ఫైర్ అయ్యాడు. అంతేకాదు ఈ వార్తలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్న మీడియాపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశాడు.

పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు భారత్‌ భయపడుతోందని పీసీబీ మాజీ చీఫ్‌ నజమ్‌ సేథీ చేసిన ట్వీట్‌పై సునీల్‌ గవాస్కర్ స్పందించాడు. ‘వారి నుంచి ఏ ప్రకటన వచ్చినా.. మన మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. భారత్ జట్టును పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఎంపిక చేస్తున్నట్లు ఉంది. మన జట్టుతో వాళ్లకేం సంబంధం?. మనవాళ్లు ఎవరైనా వెళ్లి.. వాళ్ల టీమ్‌ని సెలెక్ట్ చేస్తున్నారా?. భారత జట్టుని ఎంపిక చేయడం వాళ్ల పని కాదు. మీడియాలో చూపించి మనమే వాళ్లకు అవకాశం ఇస్తున్నాము’ అని సన్నీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

భారత ఆటగాళ్లతో పోల్చుతూ.. వాళ్ల ఆటగాళ్లే గొప్ప అని కొందరు ఇతర దేశ మాజీలు ప్రచారం చేసుకుంటారని సునీల్‌ గవాస్కర్ అన్నాడు. ‘విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ కంటే బాబర్‌ ఆజామ్ గొప్ప అని.. షహీన్‌ అఫ్రిద్‌ మంచి బౌలర్ అని.. సచిన్‌ కంటే ఇంజిమాముల్‌ మంచి బ్యాటర్‌ అని పాక్ మాజీలు గొప్పలు చెప్పుకుంటున్నారు. దాంతో వాళ్ల అభిమానులకు వారు దగ్గరవుతున్నారు. మన మీడియాలో వారి అభిపాయలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వొద్దు. జట్టులో పాలనా ఆటగాడు ఉండాలని.. 3, 4 స్థానాల్లో ఎవరు బ్యాటింగ్‌ చేయాలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చెబుతుంది. వారి సలహాలు మనకు అవసరం లేదు’ అని సన్నీ ఘాటుగా స్పందించాడు.