Leading News Portal in Telugu

Rahul Gandhi: “ఉక్రెయిన్-రష్యా” వివాదంలో భారత్ వైఖరిపై రాహుల్ కీలక వ్యాఖ్యలు..


Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూరప్ పర్యటనలో భాగంలో బెల్జియంలో పర్యటిస్తున్నారు. వారం రోజుల పాటు ఆయన యూరప్ లో పర్యటించనున్నారు. అక్కడి పార్లమెంట్ సభ్యులను, ప్రవాసభారతీయులను, పలువురు వ్యాపారవేత్తలను ఆయన కలవనున్నారు. రాహుల్ గాంధీతో పాటు శ్యామ్ పెట్రోడా కూడా ఈ పర్యటనలో ఉన్నారు. యూరప్ చివర్లో ఆయన నార్వేలో పర్యటించనున్నారు. ఓస్లోలో అక్కడి పార్లమెంటేరియన్ సభ్యులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఉక్రెయిన్-రష్యా వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో భారత వైఖరిని సమర్థించారు. భారతదేశ ప్రస్తుత వైఖరితో ప్రతిపక్షాలు ఏకీభవిస్తాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. రష్యాతో మాకు సంబంధాలు ఉన్నాయని, దీనిపై ప్రతిపక్షాలకు కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయని తాను అనుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వం ఇప్పుడు అనుసరిస్తున్న విధానంతో భిన్నాభిప్రాయాలు ఉండకపోవచ్చని రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

అంతకుముందు మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా ఇలాంటి సమాధానమే ఇచ్చారు. రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి మద్దతు పలికారు.రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఏదో దేశం వైపు నిలవకుండా భారత ప్రభుత్వం తటస్థంగా ఉండటం మంచి నిర్ణయమని ప్రభుత్వాన్ని కొనియాడారు. దేశసార్వభౌమధికారం, ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని న్యూట్రల్ గా వ్యవహరించడం గొప్ప విషయమని మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రస్తుత కాలంలో విదేశాగం విధానం ప్రాధాన్యత పెరిగిందని, మన దేశ విషయంలో ఇతర దేశాలు కలుగజేసుకోకుండా చూసుకోవాలని సూచించారు. జీ20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.