Bhumana Karunakar Reddy: తిరుమలలో ఉదయం శ్రీనివాస మంగాపురంలో శత కుండాత్మక మహాశాంతి వరుణయాగం నిర్వహించారు. ఆచార్య రుత్విక్ నేపథ్యంలో ఈ యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. సమృద్దిగా వర్షాలు కురవడానికి వరుణ యాగం నిర్వహిస్తున్నామని తెలిపారు. వరుణ యాగానికి ఇవాళ సాయంత్రం అంకురార్పణ జరగనుందని ఆయన పేర్కొన్నారు.
గత నెల(ఆగష్టు)లో తిరుమలలో వరుణ యాగం నిర్వహించడం వల్ల వర్షాలు కురిసాయని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. రానున్న రెండేళ్లలో వర్షపాతం తక్కువ నమోదవుతుందని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం (వరుణ యాగం) నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ వరుణయాగం వర్షాలు సమృద్ధిగా కురిపించి మానవాళి శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ యాగం ఎంతో కష్టసాధ్యమైందని, ఎంతో ప్రాముఖ్యమైందని చెప్పారు. గతంలో ఎన్నడూ ఈ తరహాలో యాగం జరగలేదని తెలిపారు. ఈ యాగం నిర్వహించడానికి మూడు రాష్ట్రాల నుంచి అర్చకులు, దాదాపు 60 మందికి పైగా వైఖానస ప్రముఖులు, 30 మందికి పైగా వేద పండితులు, 215 మందికి పైగా రుత్వికులు ఈ హోమాన్ని చేయనున్నారని వివరించారు. ఈ యాగం వల్ల పరిపూర్ణంగా వర్షాలు కురుస్తాయన్న నమ్మకం ఉందన్నారు.
మరోవైపు తిరుమలలో చిరుత సంచారం అధికమవడంతో.. టీటీడీ అలిపిరి నడక దారిన వెళ్లే భక్తులకు చేతి కర్రలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే త్వరలోనే చంద్రగిరి సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గంలో కూడా భక్తులకు చేతి కర్రలు ఇవ్వనున్నట్లు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.