MLA Rapaka: టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో కొనసాగుతుంది. అయితే అంతకుముందు రాజోలులో టీడీపీ కార్యకర్తల ఫ్లెక్సీల పంచాయతీ తారాస్థాయికి చేరింది. రాజోలు మండలం తాటిపాకలో లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఒక వర్గం నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఇంఛార్జి ఫొటో లేకపోవడంతో ఓ వర్గం వారు ఆగ్రహంతో ఆ ప్లెక్సీలు చించివేశారు. దీంతో ఆగ్రహించిన మరో వర్గం వారు వేసిన ప్లెక్సీలు చించివేయడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి చేరింది.
ఈ ఫ్లెక్సీ వార్ పై వర్గపోరుపై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు స్పందించారు. తెలుగు తమ్ముళ్లు ఒక మహిళా సర్పంచ్ పై దాడికి దిగడం ఆ పార్టీ దిగజారుడు తనాన్ని బయటపడుతుందని ఎద్దేవా చేశారు. లోకేష్ యువగళం పాదయాత్ర ఎక్కడ జరిగినా.. వారి వర్గపోరు బహిర్గతం అవుతుందని అన్నారు. లోకేశ్ నిర్వహించే పాదయాత్ర.. యువగళం కాదని గొడవలగళంగా వర్ణించారు. మరోవైపు చంద్రబాబు నాయుడుకి ఐటీ నోటీసులు జారీ చేస్తే సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణిలో వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
అనంతరం రాజోలు మండలం బి.సావరం గ్రామంలో ఎమ్మెల్యే రాపాక గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరుపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.