Leading News Portal in Telugu

G20 Dinner: ఖర్గేని విందుకు పిలువకపోవడంపై రాజకీయం.. కుల వివక్ష అంటూ విమర్శలు..


G20 Dinner: భారత్ ప్రతిష్టాత్మకంగా జీ20 సదస్సును నిర్వహిస్తోంది. దాదాపుగా 30కి పైగా దేశాధినేతలు ఈ సమాశాలకు హాజరవుతున్నారు. వివిధ దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులను, వ్యాపార దిగ్గజాలను ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ఈ విందుకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత, క్యాబినెట్ హోదా ఉన్న మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందలేదు.

కాగా ఇప్పుడు ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తిచూపుతోంది. కులవివక్ష అని విమర్శలు గుప్పిస్తోంది. దళిత నేత అయిన ఖర్గేను జీ20 విందు అతిథి జాబితా నుంచి తప్పించడంతో మోడీ ప్రభుత్వం కులవివక్ష చూపించిందని తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత మోహన్ కుమారమంగళం ఆరోపించారు. మనుస్మృతి రచించిన మహర్షి మనువు వారసత్వాన్ని ప్రధాని మోడీ సమర్థిస్తున్నారంటూ, కుల వివక్ష చూపిస్తున్నాంటూ ఆయన ఆరోపిస్తున్నారు.

అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి ‘భూమి పూజ’ చేసే సమయంలో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను ఆహ్వానించలేదని, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదని ఆయన అన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ప్రతిపక్షాలకు విలువ ఇవ్వరని, అందుకే తమను జీ20 సమావేశానికి పిలవలేదని, దేశ జనాభాలో 60 శాతం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకత్వానికి విలువ ఇవ్వరని అన్నారు. అయితే ఈ విందుకు ఏ రాజకీయ పార్టీలను పిలువలేదు.