Harassment: మస్కట్-ఢాకా విమానం ముంబై మీదుగా ప్రయణిస్తున్న క్రమంలో ఓ బంగ్లాదేశీ ప్రయాణికులు మహిళా ఫ్లైట్ అంటెండెంట్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 30 ఏళ్ల బంగ్లాదేశ్ ప్రయాణికుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ కి చెందిన మహ్మద్ దులాల్ అనే ప్రయాణికుడు విస్తారా విమానంలో మస్కట్ నుంచి ముంబై మీదుగా ఢాకా వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతను మహిళ ఫ్లైట్ అటెండెంట్ తో అనుచితంగా ప్రవర్తించాడు.
విమానం ముంబైలో ల్యాండ్ కావడానికి అరగంట ముందు దులాల్ తన సీటు నుంచి లేచి మహిళను కౌగిలించుకున్నాడు. ఆమెను ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఇతర క్యాబిన్ సిబ్బంది, ప్రయాణికులు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన సమయంలో వారిని తోసేసే ప్రయత్నం చేశాడని అధికారులు తెలిపారు. ఫ్లైట్ కెప్టెన్ వార్నింగ్ ఇచ్చినా సదరు నిందితుడు పట్టించుకోలేదు. ముంబైలో విమానం ల్యాండైన వెంటనే ప్రయాణికుడిని భద్రతా అధికారులకు అప్పగించారు. దులాన్ ని సహర్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. మహిళా ఫ్లైట్ అటెండెంట్ ఇచ్చి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసులు నమోదు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరచగా.. శుక్రవారం వరకు పోలీస్ కస్టడీ విధించారు.