ఏలిన వారికి అడుగులకు మడుగులొత్తడానికే పరిమితమా?.. నవ్వుల పాలౌతున్న ఏపీ పోలీసు వ్యవస్థ! | ap police loosing reliability| credibility| slave| ruling| party| attacks| cases| opposition
posted on Sep 9, 2023 1:32PM
చట్టానికీ, న్యాయానికీ ధర్మానికీ కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అనే పవర్ ఫుల్ సినిమా డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. పోలీసు ప్రస్తావన వచ్చినప్పుడల్లా అందరూ ఈ డైలాగ్ ను ఉటంకించడం పరిపాటిగా మారిపోయింది. అటువంటి నాలుగో సింహం ఏపీలో మాత్రం నవ్వుల పాలౌతోంది. అభాసుపాలౌతోంది. అధికార పార్టీ క్రియాశీల కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న కొందరు పోలీసు అధికారుల తీరుతో మొత్తం పోలీసు వ్యవస్థపైనే జనంలో నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర పోలీసు వ్యవస్థ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పాలి. ముఖ్యంగా సీఐడీ నమోదు చేసే ప్రతి కేసూ, చేసే ప్రతి అరెస్టు కేవలం అధికార పార్టీ ప్రాపకం కోసమే అన్నట్లుగా ఉంటున్నాయి. ఇందుకోసం సీఐడీ సీఆర్పీసీ నిబంధనలను సైతం తుంగలో తొక్కి ముందుకు సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పోలీసు వ్యవస్థ విపక్ష నేతల పర్యటనలకు భద్రత కల్పించాల్సింది పోయి వారిపై దాడులు జరుగుతుంటే ప్రేక్షక పాత్ర పోషించడం కొండొకచో.. దాడులకు పాల్పడేవారికి రక్షణ కవచంగా నిలబడటం చేస్తోందంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు.. జనసేనాని పవన్ కల్యాణ్.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇలా విపక్షాల నాయకులపై అధికార పార్టీ శ్రేణులు దాడులకు తెగబడుతుంటే పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి నిలబడిపోతోందన్న విమర్శలను ఎదుర్కొంటోంది. నిందితులపై చర్యలు తీసుకోవలసిన, ముద్దాయిలపై కేసులు పెట్టాల్సిన వాళ్లు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ, విపక్షాల నేతలను, కార్యకర్తలను వేధింపులకు గురి చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఏ రాష్ట్రంలోనయినా వీవీఐపీలు, కేంద్రభద్రత ఉన్న ప్రముఖులకు.. ఆయా రాష్ట్రాల పోలీసులు భద్రత కల్పించడం రివాజు. సదరు ప్రముఖుల పర్యటన పూర్తయ్యేవరకూ ఎటన్షన్ లో ఉండాల్సిన పోలీసులు ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. విపక్ష నేతల. మరీ ముఖ్యంగా జడ్ ప్లస్ క్యాటగరీ భద్రత ఉన్న చంద్రబాబు పర్యటన సందర్భంగా జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలకు పోలీసుల ప్రోత్సాహం, సహకారం ఉందన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏపీలో అధికార పార్టీ మూకలు జడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబు పర్యటనలలో ఆయనకు అత్యంత సమీపంగా వెళ్లి దాడులకు తెగబడుతున్నా.. ఏపీ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. పైపెచ్చు అధికార పార్టీ శ్రేణులకు చంద్రబాబుకు అత్యంత సమీపంలోకి వెళ్లేందుకు రూట్ క్లియర్ చేస్తున్నారని తెలుగుదేశం శ్రేణులు విమర్శిస్తున్నాయి. చంద్రబాబు పర్యటనలలో వరుసగా చోటు చేసుకున్న, చోటు చేసుకుంటున్న సంఘటనలకు సంబంధించి వీడియోలు తెలుగుదేశం విమర్శలు అక్షర సత్యాలనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అంతా జరిగిన తరువాత తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేసి స్వామి భక్తిని నిస్సిగ్గుగా ప్రదర్శిస్తున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్న తెలుగుదేశం కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేసి, అద్దాలు-తలుపులు ధ్వంసం చేసి, కార్యాలయ సిబ్బందిని గాయపరిస్తే వారిపై కేసులు నమోదు చేయడం కానీ, అరెస్టు చేయడం కానీ జరగకపోవడాన్ని తెలుగుదేశం వర్గాలు ఎత్తి చూపుతున్నాయి. పోలీసుల చిత్తశుద్ధిని, విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాయి. తెలుగుదేశం కార్యాలయంపై వైసీసీ దాడి అనంతరం ఎస్పీజీ అధికారులు వచ్చి పరిశీలించి బాబు భద్రత విషయంలో మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి వెళ్లారంటే ఏపీ పోలీసుల తీరు ఎంత దివ్యంగా ఉందో ఇట్లే అవగతమౌతుంది.
హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమంలో అనుచిత పోస్టింగుల విషయంలో చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర పోలీసులు, సీఐడీ విఫలమయ్యారంటూ హైకోర్టు ఆ కేసులు సీబీఐకి అప్పగించిందంటేనే ఏపీలో పోలీసు వ్యవస్థ తీరు తెన్నులు ఎలాగున్నాయన్నది ఎవరికైనా అర్ధమైపోతుంది. అయితే సీఎంపై సోషల్మీడియాలో పోస్టింగులు పెట్టారన్న కారణంతో వృద్ధులు, వికలాంగులు, విద్యార్ధులపై కేసులు పెట్టే పోలీసుల ఉత్సాహం.. హైకోర్టు జడ్జిలపై పోస్టింగుల విషయంలో ఏమైందని ప్రశ్నలు అదే సమాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతున్నాయి.
అలాగే మార్గదర్శి కేసుల , అత్యుత్సాహం ప్రదర్శించవద్దన్న కోర్టు ఆదేశాలు కూడా సీఐడీ ధిక్కరిస్తున్న వైనం పరిశీలిస్తే పోలీసులకు నిజమైన బాస్ ఎవరో ఇట్టే తెలిసిపోతుందని పరిశీలకులు అంటున్నారు. అధికారంలో ఉన్న వారికి అడుగులకు మడుగులొత్తుతున్న పోలీసు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం పూర్తిగా కోల్పోక ముందే తీరు మార్చుకుంటే మేలని పరిశీలకులు హితవు పలుకుతున్నారు.
తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని ఏపీ సీఐడీ నంద్యాలలో అరెస్టు చేసిన తీరు, ఆ సందర్భంగా పోలీసులు చూపిన అత్యుత్సాహం, ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు ఉందో లేదో కూడా చూసుకోకుండా అరెస్టు చేస్తున్నట్లుగా నోటీసు ఇచ్చి విజయవాడకు తరలించడం చూస్తుంటే.. పోలీసులు చట్టానికి లోబడి కాకుండా.. అధికారంలో ఉన్న కొద్ది మంది వ్యక్తుల ఆదేశాల మేరకు పని చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు అంటున్నారు.