Leading News Portal in Telugu

G20 Summit: జీవ ఇంధనంపై ప్రపంచ కూటమి ఏర్పాటు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన


G20 Summit: దేశ రాజధానిలో జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో రెండో సెషన్‌ ప్రారంభమైంది. జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోడీ మొదటి సెషన్‌లోనే అనేక ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. జీ20 తొలి సెషన్‌ను ముగించిన అనంతరం ప్రధాని మోదీ ఈరోజు మీడియాతో మాట్లాడారు. జీవ ఇంధనంపై ప్రపంచ కూటమిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. క్లీన్ ఫ్యూయల్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి జీవ ఇంధనంపై ప్రపంచ కూటమని ఏర్పాటు చేయడానికి అంగీకరించినట్లు ప్రధాని వెల్లడించారు. ఈ కూటమిలో ప్రపంచమంతా చేరాలని కోరారు. ఈ చొరవలో చేరాలని భారతదేశం యావత్ ప్రపంచాన్ని ఆహ్వానిస్తోందని ప్రధాని అన్నారు. పరిశుభ్రమైన వాతావరణాన్ని సృష్టించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని అన్నారు.

జీ20 సదస్సులో, పర్యావరణం, వాతావరణ పరిశీలనల కోసం జీ20 ఉపగ్రహ మిషన్‌ ‘జీ20 శాటిలైట్ మిషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ అబ్జర్వేషన్‌’ను ప్రారంభించాలని భారతదేశం ప్రతిపాదించింది. గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్‌పై కలిసి పని చేయాలని జీ20 దేశాలను ప్రధాని మోడీ కోరారు. దీనితో పాటు పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని 20 శాతానికి పెంచడానికి భారతదేశం ప్రపంచ స్థాయి చొరవను ప్రతిపాదించింది. సమ్మిళిత శక్తి పరివర్తన కోసం ట్రిలియన్ల డాలర్లు అవసరమని, అభివృద్ధి చెందిన దేశాలు ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ప్రధాని అన్నారు.

జీ-20 సమ్మిట్ తొలి సెషన్ తర్వాత ప్రధాని మోదీ పలు కీలక ప్రకటనలు చేశారు. జీ20 సమ్మిట్‌లో ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఏకాభిప్రాయాన్ని ప్రకటిస్తూ దీనిని సాధ్యం చేసేందుకు కృషి చేసిన జీ20 షెర్పాలు, మంత్రులు, ఇతర అధికారులకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. సదస్సు తొలిరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, యూకే పీఎం రిషి సునాక్, ఆస్ట్రేలియా పీఎం ఆంథోనీ అల్బనీస్, జపాన్ పీఎం ఫుమియో కిషిడా, చైనా పీఎం లీ కియాంగ్, ఇండోనేషియా అధ్యక్షుడు విడోడో, సౌదీ అరేబియా క్రౌన్‌ పిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా డా సిల్వా మొదలైన ప్రముఖ ప్రపంచ నాయకులతో సమావేశమయ్యారు.