Leading News Portal in Telugu

Asian Cup 2023: ఇండియాకు పాక్ గట్టి ఝలక్.. బరిలోకి నలుగురు ఫాస్ట్ బౌలర్లు


2023 ఆసియా కప్‌లో రేపు(ఆదివారం) భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. సూపర్-4 రౌండ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ ఆసక్తికర మ్యాచ్ కోసం పాకిస్థాన్ తన ప్లే ఎలెవన్‌ని ప్రకటించింది. నలుగురు ఫాస్ట్ బౌలర్లతో పాకిస్థాన్ జట్టు భారత్‌తో తలపడనుంది. భారత్‌తో జరిగే సూపర్-4 మ్యాచ్‌కు నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ బాబర్ ఆజం.. స్పిన్ ఆల్ రౌండర్ మహ్మద్ నవాజ్‌ను జట్టులోకి తీసుకోలేదు. అతని స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ ఫహీమ్ అష్రాఫ్‌కు అవకాశం కల్పించారు.

భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రాఫ్‌ బౌలింగ్ పై.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. అష్రాఫ్ ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో కూడా బ్యాటింగ్ చేయగలడు. సూపర్-4లో బంగ్లాదేశ్‌పై అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత్‌పై బౌలింగ్ బాణాన్ని ఎక్కుపెట్టేందుకు పాకిస్తాన్ నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఎవరున్నారంటే.. షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్‌లతో పాటు ఫహీమ్ అష్రఫ్ యాక్షన్‌లో కనిపిస్తారు. ఇక స్పిన్ బౌలింగ్ విభాగానికొస్తే.. షాదాబ్ ఖాన్ లీడ్ స్పిన్నర్‌గా వ్యవహరించనున్నాడు. అతనికి మద్దతుగా సల్మాన్ అగా, ఇఫ్తికర్ అహ్మద్ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-4 తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అందుకే అదే ప్లేయింగ్ ఎలెవెన్‌పై బాబర్ ఆజం విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆ టీమ్ తోనే ఇండియా టీమ్ తో పోటీ పడనున్నారు.

భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్- బాబర్ అజామ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అగా, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫహీమ్ అష్రాఫ్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రౌఫ్.