G20 Summit: ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 2022లో యూకే ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి సునక్ భారతదేశానికి రావడం ఇదే తొలిసారి. జీ20 సమావేశాలు, ఇతర కార్యక్రమాలలో ఉన్నత స్థాయి భాగస్వామ్యానికి గుర్తుగా.. భారతదేశం జీ20 ప్రెసిడెన్సీ సమయంలో యూకే మద్దతుకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
భారతదేశం-యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు రోడ్‌మ్యాప్ 2030, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ, రక్షణ, భద్రత, సాంకేతికత, గ్రీన్ టెక్నాలజీ, వాతావరణ మార్పులు, ఆరోగ్యంతో పాటు పలు రంగాలలో ద్వైపాక్షిక సహకారం, విభిన్న రంగాలలో పురోగతి గురించి ఇరువురు నాయకులు చర్చించారు. ఇరువురు నేతలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాల ప్రాముఖ్యత, పరస్పర ప్రయోజనాలపై కూడా అభిప్రాయాలను పంచుకున్నారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చల పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. మిగిలిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించవచ్చని, తద్వారా సమతుల్య, పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై త్వరలో సంతకం చేయబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మరింత వివరణాత్మక చర్చ కోసం ముందస్తు, పరస్పరం అనుకూలమైన తేదీలో ద్వైపాక్షిక పర్యటన కోసం ప్రధాని మోడీ యూకే ప్రధానమంత్రి సునాక్‌ను ఆహ్వానించారు. ప్రధాన మంత్రి సునాక్ ఆహ్వానాన్ని అంగీకరించారు. విజయవంతమైన జీ20 సమ్మిట్ కోసం ప్రధాని మోడీని రిషి సునాక్ అభినందించారు.