Leading News Portal in Telugu

PM Modi-Biden Meet: బైడెన్‌కి ప్రధాని విందు.. జెట్ ఇంజన్లు, న్యూక్లియర్ టెక్నాలజీపై చర్చలు..


PM Modi-Biden Meet:ఇండియా ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహిస్తోంది. సెప్టెంబర్9-10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. జీ20 సభ్యదేశాలతో పాటు మొత్తం 30 దేశాధినేతలు, పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునేందుకు ఇదే మంచి సమయం అని ఇండియా భావిస్తోంది. జో బైడెన్, మక్రాన్, రిషి సునాక్ వంటి అగ్రరాజ్యాల నేతలతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు.

ముఖ్యంగా అందరి కళ్లు మోడీ-బైడెన్ భేటీపైనే ఉంది. అమెరికా-ఇండియాల మధ్య సంబంధాలు మరింత బలపడేందుకు ఈ భేటీ దోహదం చేయనుంది. ఈ రోజు తెల్లవారుజామున అమెరికా నుంచి బయలుదేరిని జోబైడెన్ నేరుగా ప్రధాని మోడీ నివాసానికి వెళ్తారని తెలుస్తోంది. అక్కడే ఈ రోజు సాయంత్రం జో బైడెన్ కి ప్రధాని ఈరోజు రాత్రి ప్రైవేట్ డిన్నర్ ఇవ్వనున్నారు. ఇరు దేశాధినేతల ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఈ విందు ఉంటుంది.

ఇరు దేశాల మధ్య పలు అంశాలు చర్చకు రానున్నాయి. అయితే ముఖ్యంగా జెట్ ఇంజన్ల తయారీ, న్యూక్లియర్ టెక్నాలజీలే ప్రధాన ఎజెండా ఉంటాయని తెలుస్తోంది. జేఈ ఇంజన్లు, పౌర అణుసాంకేతికతపై పురోగతి ఉండాలని వైట్‌హౌస్‌ భావిస్తోందని జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సుల్లివన్‌ గురువారం మీడియా సమావేశంలో అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ యూనిట్, భారత వైమానికదళం ఫైటర్ జెట్ల కోసం ఇండియాలో సంయుక్తంగా తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందానికి ఇటీవల యూఎస్ కాంగ్రెస్ కూడా ఆమోదం తెలిపింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల జెట్ ఇంజన్ల సాంకేతికత బదిలీ కూడా ఉంది.