YSRCP Leaders Kottu Satyanarayana, Magani Bharat Comments On Chandrababu Naidu Arrest:
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని సీఐడీ ఈరోజు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడును అదుపులోకి తీసుకున్న అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో సెక్షన్ 109 (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్), 120బీ (కుట్ర), 420, 418 (చీటింగ్), 465 (ఫోర్జరీ), 468 (ఫ్యాబ్రికేటేడ్ డాక్యుమెంట్స్ తయారు చేయడం),471 (అబద్దాలను నిజం చేయడం), 166, 167 (క్రిమినల్ నేచర్) ఇంకా పలు సెక్షన్ల ఉన్నాయి. చంద్రబాబును అరెస్ట్ చేయడంతో టీడీపీ శ్రేణులు నిరనలకు దిగగా, వైసీపీ శ్రేణులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం సమంజసమే అని వైసీపీ నేతలు అంటున్నారు.
చంద్రబాబు అరెస్ట్ పై ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. ఈ విషయంలో అరెస్ట్ అవుతానని వారం పది రోజుల నుంచి చంద్రబాబు భయపడినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఈ స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ ను చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే స్పెషల్ గా క్యాబినెట్ లోకి తీసుకొచ్చారని చెప్పారు. రూల్స్ కి విరుద్ధంగా క్యాబినెట్ ను కూడా తప్పుదారి పట్టించి దానిని ఆమోదించేలా చేశారని ఆరోపించారు. 2017 లోనే సీఐడీ ఇది స్కాం అని కనిపెట్టిందని చెప్పిన ఆయన కానీ అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు దీనిని పైకి రాకుండా మేనేజ్ చేశారన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్స్ లో ఇది ఒక చిన్న స్కాం మాత్రమే అన్న సత్యనారాయణ ఇంకా వేల కోట్లు స్కామ్స్ ఉన్నాయన్నారు.
చంద్రబాబు తన 14ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం, 40 ఏళ్ల రాజకీయ చరిత్రని రాష్ట్రాన్ని దోచుకోడానికే ఉపయోగించారన్నారు. చంద్రబాబుకు నోటిసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబడుతున్నారని సీఐడీ ఆధారాలతోనే అరెస్ట్ చేస్తుందని అన్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని సత్యనారాయణ అన్నారు. ఇక ఇదే విషయంపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా స్పందించారు. ప్రజా ధనం దారి మళ్ళించారు కాబట్టే చంద్రబాబు అరెస్టు అయ్యారన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలు చేయదని, తప్పు చేశారు కాబట్టే చంద్రబాబు జైలు పాలయ్యారని తెలిపారు. 18 కేసులలో స్టేలు తెచ్చుకుని చంద్రబాబు శ్రీరంగ నీతులు చెబుతున్నారని, ఆయన అవినీతి, అక్రమాలలో ఇదొక మచ్చు తునక మాత్రమేనని మార్గాని భరత్ అన్నారు.