Leading News Portal in Telugu

IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత తుది జట్టులో ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఉంటారా?


India Playing XI vs Pakistan for Asia Cup 2023: ఆసియా కప్‌ 2023లో మరోసారి దాయాదుల పోరు జరగనుంది. సూపర్‌-4లో భాగంగా మరికొద్ది గంటల్లో కొలంబో వేదికగా భారత్‌, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్ ప్రేమదాస స్టేడియంలో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) రిజర్వ్‌డేను కేటాయించింది. పాకిస్థాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో భారత తుది జట్టుపైనే అందరి కళ్లు ఉన్నాయి.

తుది జట్టు ఎంపికే ఇప్పుడు భారత్ కెప్టెన్ రోహిత్ శర్మకు అతిపెద్ద సవాల్‌గా మారింది. ఫిట్‌నెస్‌ నిరూపించుకుని వచ్చిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ తుది జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రపంచకప్ 2023ని దృష్టిలో ఉంచుకుని రాహుల్‌కు ఛాన్స్ ఇవ్వాలంటే.. ఇషాన్‌ కిషన్‌ లేదా శ్రేయస్‌ అయ్యర్‌లలో ఒకరిని పక్కన పెట్టాలి?. యువ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్‌ అద్భుతంగా రాణిస్తుండటంతో.. అతడిని పక్కన పెట్టే అవకాశం లేదు. దీంతో అంతగా రాణించని అయ్యర్‌ స్థానంలో రాహుల్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.

సతీమణి ప్రసవం కోసం భారత్ వచ్చిన జస్ప్రీత్‌ బుమ్రా.. తాజాగా జట్టుతో చేరాడు. బుమ్రాను తుది జట్టులోకి తీసుకోవడం ఖాయమే. మరోవైపు ప్రేమదాస స్టేడియం పిచ్‌ పేస్‌కు అనుకూలంగా ఉంటుందనే వాదన నేపథ్యంలో బుమ్రా, మొహ్మద్ సిరాజ్‌తో పాటు సీనియర్ పేసర్‌ మొహ్మద్ షమీని తీసుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తోందట. దీంతో పేస్‌ ఆల్‌రౌండర్ శార్దూల్‌ ఠాకూర్‌ బెంచ్‌కే పరిమితం అవుతాడు. ఈ మార్పులు మినహా మిగతా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.