Leading News Portal in Telugu

African Union Chairperson: భారత్ ఐదో “సూపర్ పవర్”..


African Union Chairperson: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాన్ని నిర్వహించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు ఈ రోజు ముగిశాయి. అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, చైనా ప్రీమియర్ లీ కియాంగ్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా వంటి పలువురు దేశాధినేతుల, ఇతర సంస్థల అధికారులు న్యూఢిల్లీకి వచ్చారు. భారత్ వారందరూ ఫిదా అయ్యేలా ఆతిథ్యం ఇచ్చింది.

ఇదిలా ఉంటే జీ 20లోకి కొత్త సభ్యదేశంగా ఆఫ్రికన్ యూనియన్ చేరింది. తాజాగా భారత్ నిర్వహించిన జీ20 సదస్సు గురించి ఆఫ్రికన్ యూనియన్ చైర్‌పర్సన్, యూనియన్ ఆఫ్ కొమెరోస్ ప్రెసిడెంట్ అజలీ అసోమానీ మాట్లాడారు. తమకు సభ్యత్వం కల్పించడంపై ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశం ప్రపంచంలో 5వ సూపర్ మపవర్ అని అన్నారు. ఆఫ్రికాలో భారత్ కు అన్ని అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భారత్ శక్తివంతమైందని, ఇటీవలే అంతరిక్ష విజయం సాధించిందని కాబట్టి మేం భారత్ తో సమన్వయం చేసుకోవాలని అన్నారు. నివాసపరంగా చూసుకుంటే భారత్ సూపర్ పవర్ అని, ఇప్పుడు చైనా కంటే ముందుందని ఆయన అన్నారు.

జీ20 యూనియన్ శాశ్వత సభ్యత్వాన్ని ప్రకటించిన తర్వాత భావోద్వేగానికి గురయ్యానని అన్నారు. వాస్తవానికి ఆఫ్రికన్ యూనియన్ చేరికపై చర్చలు జరగబోతున్నాయని, ఆ తరువాత నిర్ణయం తీసుకుంటారని అనుకున్నా.. కానీ ఈ సమావేశం ప్రారంభయ్యే సమయానికే మమ్మల్ని సభ్యులుగా ప్రకటించారని.. ఇది జరిగిన వెంటనే ఏడవబోయానని అన్నారు.