Leading News Portal in Telugu

IND vs PAK: ఆగని వర్షం.. రిజర్వ్ డేకు ఇండియా- పాక్‌ మ్యాచ్‌


IND vs PAK: ఆసియా కప్‌ 2023 టోర్నీ సూపర్‌ 4 రౌండ్‌లో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రిజర్వ్ డేకు వాయిదా పడింది. టాస్‌ గెలిచిన పాక్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా.. భారత జట్టు బ్యాటింగ్‌ బరిలోకి దిగింది. 24.1 ఓవర్లలో భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసిన తర్వాత వర్షం మొదలైంది. దాదాపు రెండు గంటల విరామం తర్వాత వర్షం ఆగిపోగా.. తిరిగి ఆట ప్రారంభం అవుతుందనగా మళ్లీ వర్షం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను రిజర్వ్‌ డేకు వాయిదా వేశారు. నేడు మ్యాచ్‌ ఆగిపోయేసరికి భారత స్కోరు 147/2. క్రీజులో కేఎల్‌ రాహుల్ (17), విరాట్ కోహ్లీ(8) ఉన్నారు.

సాయంత్రం 04:53 గంటలకు వర్షం అంతరాయంతో ఆట ఆగిపోగా.. 05:55 నిమిషాలకు వర్షం నిలిచిపోయింది అయితే అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో అంపైర్లు 7గంటలకు, 7:30 గంటలకు, 8 గంటలకు, 8:30 గంటలకు పిచ్‌ను పరిశీలించారు. చిత్తడిగా మారిన పిచ్‌ను ఆరబెట్టేందుకు మైదానం సిబ్బంది ఫ్యాన్స్‌ను తీసుకువచ్చారు. ఎట్టకేలకు మ్యాచ్‌ 9గంటలకు తిరిగి ప్రారంభమవుతుందని భావించినా మరోసారి చినుకులు పడడంతో మ్యాచ్‌ను వాయిదా వేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. రేపు(సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఎక్కడైతే మ్యాచ్‌ ఆగిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభం అవుతుంది. వర్షం అంతరాయం లేకపోతే పూర్తిగా మ్యాచ్‌ను ఆస్వాదించవచ్చు.

ఓపెనర్లుగా వచ్చిన శుభ్‌మన్‌గిల్(58), రోహిత్ శర్మ(56) అర్థశతకాలు బాది భారత్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. 121 పరుగుల భాగస్వామ్యంతో భారత స్కోరును పరుగులు పెట్టించారు. అయితే అర్థశతకాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇద్దరూ వెంటవెంటనే ఔటయ్యారు. రోహిత్ శర్మ పాక్ బౌలర్ షాదాబ్‌ ఖాన్‌ వేసిన 16.4 ఓవర్‌కు భారీ షాట్ ఆడబోయి ఫహీమ్‌ అష్రాఫ్‌కు చిక్కాడు. 121 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ను కోల్పోయింది. 18వ ఓవర్‌లో శుభమన్‌ గిల్‌(58) ఔటయ్యాడు. షాహీన్‌ అఫ్రీది వేసిన ఐదో బంతికి అఘా సల్మాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.