Leading News Portal in Telugu

Prakash Raj: ప్రకాష్ రాజ్ నిరసన సెగ.. హిందూ వ్యతిరేక వ్యాఖ్యలే కారణం..


Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా కర్ణాటకలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఆయన చేసిన హిందూ వ్యతిరేక వ్యాఖ్యలకు నిరసనగా పలు హిందూ సంఘాలు కలబురిగిలో ఆదివారం నిరసన చేపట్టాయి. నల్ల బట్టలు ధరించి ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లజెండాను ఎగరేశారు. అంతకుముందు రోజు హిందూ సంస్థ సభ్యులు కలబురిగి జిల్లా కలెక్టర్ కి ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా మెమోరాండం సమర్పించారు. అతడిని నగరంలోకి రాకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు.

కలబురిగిలో ఓ డిబేట్ లో పాల్గొనడానికి ప్రకాష్ రాజ్ వెళ్లే ముందే వ్యతిరేకత ఎదురైంది. ప్రకాష్ రాజ్ కి హిందూ సంస్థల నుంచి వ్యతిరేకత రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పలు హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన సందర్భాల్లో కూడా ఇలాంటి నిరసనలే ఎదురయ్యాయి. కొన్ని వారాల క్రితం శివమొగ్గ నగరంలో ప్రకాష్ రాజ్ సందర్శించిన తర్వాత గోమూత్రం చల్లి ప్రక్షాళన చేశారు.

ఇటీవల ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగం సమయంలో కూడా ఇటాంటి ఓ ట్వీట్ చేశారు. టీ అమ్మే కార్టూన్ తో హేళన చేశాడు. బ్రేకింగ్ న్యూస్ విక్రమ్ ల్యాండర్ ద్వారా చంద్రుడిపై నుంచి వస్తున్న మొదటి చిత్రం అంటూ కామెంట్స్ చేశారు. ఈ ఫోటో మాజీ ఇస్రో చీఫ్ శివన్ ని పోలి ఉందని పలువురు విమర్శించారు. ఈ వ్యవహారంలో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ప్రకాష్ రాజ్ విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే దీని తర్వాత ఇది ఓ మళయాళ జోక్ కి సంబంధించిందిగా తన ట్విట్ చేసిన రచ్చను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.