Rahul Gandhi: భారత వర్సెస్ ఇండియా వివాదం గత కొన్ని రోజులుగా చర్చనీయాంశం అయింది. అయితే ఈ వ్యవహారంపై మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు యూరప్ పర్యటనలో ఉన్న ఆయన ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లోని సైన్సెస్ పిఓ యూనివర్సిటీలో మాట్లాడారు. దేశం పేరు మార్చడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు ప్రాథమికంగా చరిత్రనను తిరస్కరించడానికి ప్రయత్నిస్తున్నారని, భారతదేశ ఆత్మపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఎవరైనా తమ చర్యలకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
దేశాన్ని భారత్ లేదా ఇండియా అని పిలవడం సరైంది అయినప్పటికీ, మార్పు వెనక ఉన్న ఉద్దేశ్యం ముఖ్యమని రాహుల్ అన్నారు. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ అనే పేరును పెట్టుకోవడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ఇండియా కూటమి కారణంగానే భారత్ అనే పేరు మారుస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ దేశంలోని మైనారిటీలను అణిచివేస్తోందని వ్యాఖ్యానించారు. మైనారిటీలు దేశంలో అసౌకర్యంగా భావించడం దేశానికి సిగ్గుచేటని అన్నారు.
బీజేపీ హిందుత్వ భావజాలాన్ని రాహుల్ గాంధీ విమర్శించారు. హిందూ ఇతిహాసాలు బోధించిన భావజాలంతో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేసేందేం లేదని అన్నారు. తమ కన్నా బలహీనమైన వ్యక్తులను భయభ్రాంతులకు గురిచేయకూడదని, హాని చేయకూడదని, కానీ బీజేపీ వ్యక్తులు జాతీయవాదులు కాదని, ఆధిపత్యం కోసం ఏమైనా చేయగలరని, దీంట్లో హిందు గురించి ఏం లేదని చెప్పారు.
చైనా ప్రజాస్వామ్య రహితదేశమని విమర్శించారు. ప్రపంచస్థాయిలో తయారీ పరిశ్రమ చైనా నియంత్రణలోనే ఉందని గుర్తు చేశారు. భారత్ కూడా వారితో పోటీ పడాలని, కానీ ప్రజాస్వామ్యం లేకుండా కాదని అన్నారు. భారత్ అన్ని దేశాలతో సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని, దేశ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని అన్నారు. ఏదో పక్షాన నిలవడం మాకు కష్టమవుతుందని అయితే ప్రజాస్వామ్యం అని మాకు బలమైన అభిప్రాయం ఉందని అన్నారు.