Leading News Portal in Telugu

Bengal BJP Leader: ఇండియా పేరు భారత్‌గా మారుస్తాం.. ఇష్టం లేకపోతే దేశం విడిచి వెళ్లండి!


Bengal BJP Leader: ఇండియా పేరును భారత్‌గా మారుస్తామని, కోల్‌కతాలోని విదేశీయుల విగ్రహాలను తొలగిస్తామని పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ అన్నారు. పేరు మార్పును వ్యతిరేకించే వారు దేశం విడిచి వెళ్లవచ్చని మేదినీపూర్ ఎంపీ అన్నారు. తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఖరగ్‌పూర్ నగరంలో ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ అధికారంలోకి రాగానే, కోల్‌కతాలోని విదేశీయుల విగ్రహాలన్నింటినీ తొలగిస్తాము’ అని బీజేపీ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు అన్నారు. ఇండియా పేరును భారత్‌గా మారుస్తామని, ఇష్టం లేని వారు దేశం విడిచి వెళ్లే స్వేచ్ఛ ఉందని ఆయన అన్నారు.

రాష్ట్రానికి చెందిన మరో సీనియర్ బీజేపీ నాయకుడు రాహుల్ సిన్హా మాట్లాడుతూ.. ఒక దేశానికి రెండు పేర్లు ఉండవని, జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు ప్రపంచ నాయకులు ఢిల్లీలో ఉన్నందున పేరు మార్చడానికి ఇదే సరైన సమయమని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శాంతను సేన్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఇండియా కూటమికి భయపడి వాస్తవ సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా)ను ఏర్పాటు చేశాయి.