G20 Summit: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహించింది. జీ 20 సభ్యదేశాలతో పాటు ఆహ్వానిత దేశాలకు చెందిన అధ్యక్షుడు, ప్రధానులు, ఇతర అధికారులు మొత్తం 40 మందికి పైగా ఈ సమావేశాలకు హాజరయ్యారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని ట్రూడో వంటి అగ్రనేతలు సమావేశాలకు వచ్చారు. రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్, జిన్ పింగ్ మాత్రం ఈ సమావేశాలకు హాజరుకాలేదు.
సెప్టెంబర్ 9న మొదలైన ఈ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది బ్రెజిల్ లోని రియోడి జనీరోలో జీ20 సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో జీ20 ప్రెసిడెన్సీని ప్రధాని నరేంద్రమోడీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వాకు అప్పగించారు. సంప్రదాయబద్ధంగా గావెల్ ని ప్రధాని మోడీ, బ్రెజిల్ అధ్యక్షుడికి అందించారు. ‘‘నేను బ్రెజిల్ ప్రెసిడెంట్, నా స్నేహితుడు లూలా డా సిల్వాకు అభినందించాలని అనుకుంటున్నాను, అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని అనుకుంటున్నాను’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
డిసెంబర్ 1న బ్రెజిల్ అధికారికంగా జీ20 అధ్యక్ష పదవిని చేపట్టనుంది. ఈ సందర్భంగా లూలా డ సిల్వా మాట్లాడుతూ.. వర్థమాన ఆర్థిక వ్యవస్థలకు ఆసక్తి కలిగించే గొంతు ఇవ్వడానికి భారతదేశం చేస్తున్న కృషికి గానూ ప్రధానిమోడీని ప్రశంసించారు. అంతకు ముందు ఆదివారం ఉదయం ప్రధానితో సహా పలువురు విదేశీ అధినేతలు రాజ్ ఘాట్ లోని మహత్మా గాంధీ స్మారకం వద్ద నివాళులు అర్పించారు.
#WATCH | G 20 in India | Prime Minister Narendra Modi hands over the gavel of G 20 presidency to the President of Brazil Luiz Inácio Lula da Silva. pic.twitter.com/ihEmXN9lty
— ANI (@ANI) September 10, 2023