Leading News Portal in Telugu

NZ World Cup Squad: వెరైటీగా జట్టును ప్రకటించిన న్యూజిలాండ్‌ బోర్డు.. సతీమణులు, పిల్లలతో..!


New Zealand Squad for ICC ODI World Cup 2023: అక్టోబర్ 5 నుంచి భారత గడ్డపై జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం న్యూజిలాండ్‌ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుని సోమవారం వెరైటీగా ప్రకటించింది. ప్రపంచకప్ 2023 జట్టును న్యూజిలాండ్ ఆటగాళ్ల కుటుంబ సభ్యులు ప్రకటించారు. ‘161 మై డాడీ.. కేన్ విలియమ్సన్’ అని విలియమ్సన్ పిల్లలు వీడియోలో ముందుగా చెప్పారు. ట్రెంట్ బౌల్ట్ కుమారుడు, మార్క్ చాప్మన్ సతీమణి, డెవాన్ కాన్వే భార్యలు వీడియోలో మాట్లాడారు.

న్యూజిలాండ్ ఆటగాళ్ల కుటుంబ సభ్యులు జట్టుని ప్రకటించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూజిలాండ్ జట్టుకు కేన్ విలియమ్సన్ కెప్టెన్ కాగా.. టామ్ లాథమ్ వైస్ కెప్టెన్. న్యూజిలాండ్ సెలెక్టర్లు ఫిన్ అలెన్ బదులుగా విల్ యంగ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన పేసర్లు కైల్ జేమీసన్, ఆడమ్ మిల్నేలకు చోటు దక్కలేదు. సెంట్రల్ కాంట్రాక్ట్ లేకుండా ట్రెంట్ బౌల్ట్ మరియు జేమ్స్ నీషమ్ జట్టులోకి వచ్చారు.

ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్ మరియు మాట్ హెన్రీలతో న్యూజిలాండ్ పేస్ విభాగం పటిష్టంగా ఉంది. ఆల్ రౌండర్ కోటాలో డారిల్ మిచెల్ మరియు జేమ్స్ నీషమ్ ఉన్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఇష్ సోధీ, మిచెల్ సాంట్నర్ చోటు దక్కిచుకున్నారు. కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ స్పెషలిస్ట్ బాటర్లుగా ఉన్నారు. ఇక అన్ని జట్లకు సెప్టెంబర్ 28 వరకు తమ 15 మంది ఆటగాళ్ల జట్టును ఖరారు చేసుకునే అవకాశం ఉంది. ఈ తేదీ తర్వాత ఏ ఆటగాడినైనా భర్తీ చేయాలంటే ఐసీసీ అనుమతి అవసరం.

న్యూజిలాండ్ జట్టు:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (కీపర్), డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, విల్ యంగ్.