తెలంగాణలో వచ్చే ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ఇవాళ ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇక, నిన్న (ఆదివారం) హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి నగరం మేఘావృతమై ఉంది. ఒక్కసారిగా భారీ వర్షంతో జనం వణికిపోయారు. రెండు గంటలకు పైగా వర్షం పడింది. భారీ వర్షంతో నగరంలోని రోడ్లన్ని జలమయం అయ్యాయి. పంజాగుట్ట, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, గచ్చిబౌలి లాంటి ప్రధాన కూడళ్లలలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. లోతట్టు ప్రాంతాలు మరోసారి మునిగిపోయాయి.
మరోవైపు, రుతుపవన ద్రోణి ప్రభావంతో ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, గుంటూరు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు చెప్పారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలకు పడే అవకాశం ఉందన్నారు. నిన్న (ఆదివారం) పార్వతీపురం మన్యం, అనంతపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు వెల్లడించారు.