Leading News Portal in Telugu

బాబుకు సర్వత్రా సంఘీభావం- ప్రజలను కదిలించిన లోకేష్ బహిరంగ లేఖ | solidarity to chandrababu from every corner| lokesh| open| letter| emotional| inspiration| netxzens| social| media| jagan| anarchy


posted on Sep 11, 2023 11:33AM

స్కిల్ డెవలప్ మెంట్ కేసు మెరిట్ లు డీమెరిట్ తో సంబంధం లేదు. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఏపీ సీఐడీ అరెస్టు చేసిన తీరుకు సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలో కూడా ఆయనకు మద్దతు లభిస్తోంది. తమ కూటమిలో లేకపోయినా విపక్షాల ఐక్య కూటమి ఇండియా చంద్రబాబునాయుడిని అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండించింది. ఏపీలో జగన్ అరాచక పాలనకు ఇది నిలువెత్తు నిదర్శనమనీ, జగన్ అరాచక పాలనకు కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నదని ఇండియా పేర్కొంది. ఏపీలో జగన్, కేంద్రంలో మోడీ ఇద్దరూ కూడా నియంతృత్వ పోకడలకు పోతున్నారనీ, ప్రజాస్వామ్యాన్ని దేశ రాజ్యాంగాన్ని ఆపహాస్యం చేస్తున్నారనీ ఇండియా పేర్కొంది. ఇక ఏపీలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన కూడా చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిన్న మొన్నటి వరకూ దేశం పేరు భారత్ అని మార్చడాన్ని స్వాగతించిన పవన్ కల్యాణ్.. చంద్రబాబు అరెస్టు తీరును తీవ్రంగా ఖండిస్తూ రోడ్డుపైకి రావడం, నడి రోడ్డుపై పడుకోవడం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని  కనీసం బయటకు రానీయడం లేదన్న సంకేతాన్ని బలంగా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా లోకేష్ కు స్వయంగా ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని చెప్పడం తో పాటు పూర్తి సంఘీభావం ప్రకటించారు. సైకో జగన్ నియంత పాలనపై కలిసి పోరాడుదామని లోకేష్ కు పవన్ చెప్పారు. తెలుగుదేశం అధినేతను జగన్ సర్కార్ అరెస్టు చేసిన నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ లోకేష్ కు ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు. ప్రజల తరఫున నిలబడి పోరాడుతున్న విపక్ష నేతను అక్రమంగా అరెస్టు చేయడం అన్నది జగన్ కు రివాజుగా మారిపోయిందని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  

రాష్ట్రం నలుమూలల నుంచీ చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. రోడ్లపైకి వచ్చిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ, విపక్ష నేతలను హౌస్ అరెస్టులు చేస్తూ రాష్ట్రం మొత్తాన్ని జైలుగా మార్చేసిన నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ యథాతథంగా..

బాధతో బరువెక్కిన హృదయంతో, కన్నీళ్లతో తడిసిన గుండెతో ఈరోజు మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ – తెలుగుప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న తన హృదయాన్నీ – ఆత్మనూ ధారపోస్తూ ఉండటం కనులారా చూస్తూ నేను పెరిగాను. లక్షలాది తెలుగుప్రజల జీవితాలను అభివృద్దికరంగా మార్చడానికే అవిశ్రాంతంగా శ్రమిస్తూ ప్రయత్నిస్తున్న ఆయనకి విశ్రాంతి అనే ఒక రోజే తెలియదు. తన రాజకీయాలు ఎల్లప్పుడూ గౌరవం – నిజాయితీతో కొనసాగటం అందరికీ తెలిసిందే! తను సేవ చేసిన వారి ప్రేమ – కృతజ్ఞతల నుండి ఆయన మరింత లోతైన ప్రేరణను పొందుతూ మరింతగా సేవల్లో మునిగిపోవటమే నేను నిరంతరం చూశాను. ప్రజల హృదయపూర్వక కృతజ్ఞతలు చాలు వారికి.. స్వచ్ఛమైన ఆనందంతో వారి హృదయం ఆయన్ని నిరంతరం ఆనందసాగరంలో ఉంచేది, ఇది ఒక చిన్న బాలుడు పొందే ఆనందంతో సమానం.

నేను కూడా ఆయన నడిచే గొప్ప మార్గం నుండి ప్రేరణ పొందాను – తన అడుగుజాడలనే అనుసరించాను. అమెరికాలో ఎంతో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి తిరిగి వచ్చాను. ఇది నాకు చాలా కఠినమైన నిర్ణయం, కానీ నాకు మన దేశం, మన వ్యవస్థలు, మన పునాది సూత్రాలు – అన్నింటికంటే మించి మన రాజ్యాంగంపై నమ్మకం, గౌరవాలపై ఎంతో విశ్వాసం ఉంది.

ఐనప్పటికీ, ఈ రోజు, మా నాన్న ఎప్పుడూ చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్‌కు వెళ్లడం చూస్తుంటే, నా కోపం ఉప్పొంగింది – నా రక్తం ఉడికిపోతుంది. ‘రాజకీయపగ’ అనే సముద్రం ఆయనను ముంచేసే లోతులకు హద్దులే లేవా? తన దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఇన్నిన్ని ఘనకార్యాలు చేసిన నాన్నగారి స్థాయి వ్యక్తి.. ఇంత అన్యాయాన్ని ఎందుకు భరించాలి? ఎందుకంటే?! తను ఎప్పుడూ పగ రాజకీయాలకు లేదా విధ్వంసక రాజకీయాలకు దిగలేదు.. తను ఇతరుల కంటే చాలా ముందే మన ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం  – అవకాశాలను ఊహించి, ఆ దిశగా కృషి చేసినందుకా?

ఇదంతా చూస్తుంటే ఈరోజు ఒక నమ్మకద్రోహంలా అనిపిస్తుంది. కానీ, మా నాన్న పోరాట యోధుడు. నేనూ అలాగే స్ఫూర్తి పొందాను. ఆంధ్రప్రదేశ్ – ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం అచంచలమైన సంకల్పంతో మార్గనిర్దేశం చేస్తూ ఈ అన్యాయం నుంచి బైటపడి తిరుగులేని శక్తిగా తిరిగి ఎదుగుతాం. ఈ యుద్ధంలో ప్రజలే అంతిమంగా గెలవాలి! అందుకోసం నాతో మీరంతా కలిసి రావాలనీ మనందరికోసం నేను మిమ్మల్ని కోరుతున్నాను. – మీ లోకేష్

నారా లోకేష్ రాసిన ఈ ఉద్వేగ పూరిత ఈ బహిరంగ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు స్వచ్ఛందంగా లోకేష్ కు సంఘీభావం తెలుపుతూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు దుర్మార్గమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజాగ్రహ జ్వాల వచ్చే ఎన్నికలలో జగన్ అధికారాన్ని దహించి వేయడం ఖాయమని నెటిజన్లు గట్టిగా చెబుతున్నారు. నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా రాసిన ఈ లేఖను నెటిజన్లు రీట్వీట్ చేయడమే కాక భారీగా షేర్ చేస్తున్నారు.