Leading News Portal in Telugu

US Open 2023: యుఎస్‌ ఛాంపియన్‌గా జకోవిచ్‌.. మార్గరెట్‌ కోర్ట్‌ రికార్డు సమం!


Novak Djokovic wins 24th Grand Slam by beating Daniil Medvedev in US Open 2023: సెర్బియన్‌ స్టార్, టెన్నిస్ దిగ్గజం నోవాక్‌ జకోవిచ్‌ చరిత్ర సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికే అత్యధిక టైటిల్స్‌ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన జకోవిచ్‌.. టెన్నిస్‌లో ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన మార్గరెట్‌ కోర్ట్‌ (24) రికార్డును సమం చేశాడు. యుఎస్‌ ఓపెన్‌ 2023 టైటిల్ గెలిచిన జకో.. ఈ అరుదైన రికార్డును సాధించాడు. యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో రష్యా ఆటగాడు డానియల్ మెద్వెదెవ్‌ను 6-3, 7-6(7-5), 6-3 తేడాతో చిత్తు చేశాడు.

ఆదివారం జరిగిన యుఎస్‌ ఓపెన్‌ 2023 ఫైనల్‌ ఫోరు హోరాహోరీగా సాగుతుందని భావించినప్పటికీ.. నోవాక్‌ జకోవిచ్‌ జోరు ముందు మెద్వెదెవ్‌ నిలబడలేకపోయాడు. తొలి సెట్‌లో 6-3 తేడాతో మెద్వెదెవ్‌ను చిత్తు చేసిన జకోకు రెండో సెట్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఓ సమయంలో రెండో సెట్‌ను మెద్వెదెవ్‌ గెలిచేలా కనిపించినా.. జకో అనూహ్యంగా పుంజుకుని 7-6 తేడాతో కైవసం చేసుకున్నాడు. కీలక మూడో సెట్‌లో మెద్వెదెవ్‌ తేలిపోవడంతో జకోవిచ్‌ 6-3 తేడాతో గెలిచి టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ మూడు గంటల 17 నిమిషాల పాటు సాగింది.

యూఎస్‌ ఓపెన్‌ 2021 ఫైనల్లో జకోవిచ్‌ను ఓడించి తొలిసారిగా గ్రాండ్‌స్లామ్‌ను దక్కించుకున్న మెద్వెదెవ్‌.. ఈ సారి మాత్రం బోల్తా పడ్డాడు. ఈ విజయంతో జకోవిచ్‌ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇక ఈ ఏడాది జకోవిచ్‌ జోరు కొనసాగుతోంది. నాలుగు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌కు వెళ్లిన జకో.. ఆస్ట్రేలియా ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, యుఎస్‌ ఓపెన్‌లో విజయం సాధించాడు. వింబుల్డన్‌లో మాత్రం యువ ఆటగాడు కార్లోస్‌ అల్కరాస్‌ చేతిలో ఓడిపోయాడు.