Leading News Portal in Telugu

Colombo Weather: రిజర్వ్‌ డే రోజు కూడా వర్షం పడితే.. భారత్‌కు కష్టాలు తప్పవు!


What Happens If India vs Pakistan Match in Asia Cup 2023 canceled on Reserve Day: ఆసియా కప్‌ 2023లో సూపర్‌-4 దశలో భాగంగా ఆదివారం కొలంబోలో జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. భారత్‌ ఇన్నింగ్స్‌ 24.1 ఓవర్ల వద్ద వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మ్యాచ్‌ను అంపైర్‌లు నిలిపివేశారు. తర్వాత వర్షం తగ్గముఖం పట్టుముఖం పట్టినప్పటికీ.. ఔట్‌ ఫీల్డ్‌ బాగా లేకపోవడంతో మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వెళ్లింది. భారత్ ఇన్నింగ్స్ 24.1 ఓవర్ల వద్ద నుంచే నేడు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

రిజర్వ్‌ డే నాడు కూడా కొలంబోలో భారీ వర్షం పడే అవకాశముందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. మ్యాచ్ జరిగే సమయంలో 80-90 శాతం​ వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రిజర్వ్‌ డే రోజు కూడా ఆట సాధ్యపడక.. మ్యాచ్‌ రద్దు అయితే భారత్ పరిస్థితి ఏంటి? అని అభిమానులు అందోళన చెందుతున్నారు. నేడు ఇండో-పాక్ మ్యాచ్‌ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభిస్తోంది. అప్పుడు టీమిండియాకు కష్టాలు తప్పవు. ఎందుకంటే.. సూపర్‌-4లో​ పాకిస్తాన్‌, శ్రీలంక జట్లు ఇప్పటికే చెరో విజయం సాధించి రెండేసి పాయింట్లతో మొదటి రెండు స్ధానాల్లో ఉన్నాయి.

సూపర్‌-4లో భారత్‌కు పాకిస్తాన్ మ్యాచే మొదటి కాబట్టి రోహిత్ సేన ఖాతాలో ఒక పాయింట్ కూడా లేదు. ఈ పాక్ మ్యాచ్ రద్దుతో ఓ పాయింట్ వస్తుంది. భారత్ ఫైనల్‌కు చేరాలంటే మిగిలిన 2 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాలి. శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అప్పుడు 5 పాయింట్లతో ఫైనల్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లు కూడా రద్దు అయితే 3 పాయింట్లతో ఫైనల్ రేసు సంక్లిష్టంగా మారుతుంది. మరోవైపు బంగ్లాదేశ్‌ రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో.. ఆ జట్టు దాదాపుగా ఫైనల్ రేసులో లేనట్టే.