Leading News Portal in Telugu

టీటీడీ కర్రలు చూసి చిరుతలు భయపడి బొన్లో కొచ్చేస్తున్నాయా? ఏమిటీ జగన్మాయ | chita fear of ttd sticks| voluntarily comming into cage| jaganmaya| anti| social| activities| jagan| sarkar| seshachalam| forest| devotees


posted on Sep 11, 2023 4:11PM

గత నెలలో తిరుమల నడకదారిలో  చిరుత పులి నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే  అభం శుభం తెలియని చిన్నారిపై దాడి చేసి చంపేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చిరుతల నుంచి రక్షణ కోసం టీటీడీ పలు రకాల చర్యలను ప్రతిపాదించింది. వెంటనే వాటిని అమలు చేస్తామని ఘనంగా చాటింది.  ముందుగా పులుల జాడ కనిపెట్టేలా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పులులను బంధించేందుకు బోనులను ఏర్పాటు చేశారు.

ఆ తరువాత   తర్వాత నడక దారిన  వేళ్ళే భక్తులకు  చేతి కర్రలను అందించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అంతే కానీ వన్యప్రాణులు నడక దారి భక్తులపై దాడులను నిరోధించేందుకు ఆ మార్గంలో ఒక ఫెన్సింగ్ నిర్మించాలన్న ప్రతిపాదనపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. భారీ వ్యయం అవుతుందని, అందుకు టీటీడీ వెనకాడుతోందని భావించడానికి వీల్లేదు. ప్రతి రోజూ శ్రీవారి హుండీ ఆదాయం కోట్లలోనే ఉంటుంది. శ్రీవారి భక్తుల రక్షణ కోసం ఆ హుండీ ఆదాయాన్ని వాడుకోవచ్చు. కానీ ఆ దిశగా టీటీడీ చర్యలు తీసుకోవడం లేదు. కేవలం కర్రలు పంపిణీ చేయడానికి నిర్ణయం తీసుకుని ఆ పని చేసి చేతులు దులిపేసుకుంటున్నది. కర్రలు పంపిణీ చేసి వన్యప్రాణులను తరిమేయవచ్చని టీటీడీ భక్తులకు చెబుతోంది. ఈ కర్రలను అలిపిరిలో  కర్రలు అందించే టీటీడీ కొండపై వీటిని తిరిగి తీసేసుకుంటుందట. సరే అదలా వదిలేస్తే భక్తులు వారి రక్షణ వారే చూసుకోవాలంటూ కర్రలను పంపిణీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.  

క్రూర మృగాలు ఎప్పుడు ఎటు వైపు నుండి దాడి చేస్తాయో తెలియక బిక్కుబిక్కుమంటూ ఆ ఏడుకొండలవాడిపైనే భారం వేసి కాలి నడకన వెళ్తున్న భక్తులు చేతి కర్రలతో ఏం చేయాలని టీటీడీని సామాజిక మాధ్యమం సాక్షిగా నెటిజన్లు సెటైర్లు వేశారు. పులులు, సింహాలను కర్రలతో  భక్తుల తరిమికొట్టగలరా? అంటు నిలదీస్తున్నారు.  సరే కర్రల పంపిణీ సంగతి అలా ఉంచితే.. స్వల్ప వ్యవధిలో అలిపిరి నడకమార్గంలో ఐదు చిరుతలను బంధించినట్లు అటవీశాఖ, టీటీడీ అధికారులు తెలిపారు.  మరో రెండు చిరుతల కదలికలను గుర్తించామని అంటున్నారు. అయితే తిరుమల నడక దారిలో బాలికను బలితీసుకున్న చిరుత పులి ఈ బంధించిన ఐదు చిరుతలలో ఉందో లేదో చెప్పలేమంటున్నారు అధికారులు. అయినా ఇంత కాలం ఎన్ని ప్రయత్నాలు చేసిన పట్టుబడని చిరుతలు టీటీడీ భక్తులకు కర్రలు అందించడం ప్రారంభించగానే  భయపడి.. వాటంతట అవే వచ్చి బోనుల్లో కూర్చుంటున్నాయా? అసలు టీటీడీ నిజంగా ఐదు  చిరుతలను బంధించిందా? మరో రెండు చిరుతల సంచారాన్ని గుర్తించామని టీటీడీ చెబుతోంది.

ఒక్కసారిగా ఇన్ని చిరుతలు నడకమార్గం సమీపంలో సంచరించడమేమిటి? అడవిలో వాటి జీవనానికి ఆటంకం కలిగేలా ఏవైనా కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయా? అలాగే   బంధించిన చిరుతలను ఎస్వీ జూ పార్క్ కు తరలించి వాటికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్న అధికారులు.. అందులో ఏ చిరుత డీఎన్ఏ ద్వారా చనిపోయిన లక్షితను చంపిందో తెలుసుకోడానికి కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు. లక్షితను చంపిన చిరుత ఏదో తెలితే మిగిలిన చిరుతలను దూరంగా ఉన్న చిట్టడవి ప్రాంతాల్లో వదిలిపెడతామంటున్నారు. అలాగే లక్షితపై దాడి చేసిన చిరుత దొరికితే కొన్ని నెలలు దాన్ని జూలోనే ఉంచి తగినంత మార్పు వచ్చిన తరువాత అడవిలో వదిలేస్తామని, ఒకవేళ మనిషి రక్తం రుచి మరిగిన ఆ చిరుతలో మార్పు రాకపోతే కేంద్ర అధికారుల అనుమతితో చంపడం చేయాల్సి వుంటుందని అటవీ అధికారులు చెబుతున్నారు.

ఇవన్నీ సాధారణంగా చెప్పే విషయాలే. అయితే ఇక్కడే అధికారుల తీరు, మాటలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. వన్యప్రాణులు తిరుమల నడక మార్గానికి సమీపంలోకి రాకుండా చర్యలు తీసుకోవడం మాని అసలు సింహాచలం అడవులలో వన్యప్రాణులనేవే ఉండకుండా చేయాలన్న దుర్మార్గమైన యోచన ఏదైనా అదికారులలో ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  శేషాచలం అడవులను వన్యప్రాణ రహిత ప్రాంతంగా మార్చేయాలన్న అటవీ శాఖ అధికారుల చర్యలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అడవి నుండి మృగాలు తిరుమల మార్గంలోకి వచ్చే దారిలో రైలింగ్ వాల్స్ ఎత్తు పెంచడం.. నడక మార్గంలోకి అడవి నుండి మృగాలు వచ్చే అవకాశం ఉన్న చోట ఐరన్ గ్రిల్స్ తో జాలీలను ఏర్పాటు చేయడం వంటివి చేయవచ్చు. కానీ, టీటీడీ అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకోకుండా అడవి మీద పడడం చూస్తే జగన్ ప్రభుత్వ దోపిడీ ఖాతాలో ఈ అటవీ ప్రాంతం కూడా చేరిపోయిందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.  

ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే తిరుమలకు నడక దారిలో వచ్చే భక్తుల సంఖ్యను భారీగా తగ్గించే ప్రణాళికలో భాగంగానే  ఈ చిరుతల సంచారానికి దోహదపడేలా చేస్తున్నారాభక్తుల రద్దీని తగ్గించే ఆలోచన చేస్తుందా అన్న అనుమానాలు  వ్యక్తం అవుతున్నాయి.  గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వేంకటేశ్వరస్వామికి ఏడు కొండలు ఎందుకు.. రెండు కొండలు సరిపోవా అని అసెంబ్లీ సాక్షిగా వాక్రుచ్చారు. ఇప్పుడు ఆయన కుమారుడు  ఏపీ సీఎంగా ఉన్నారు. తన తండ్రి మాటలను నిజం చేసే కార్యక్రమాన్ని ఆయన మొదలెట్టారా? అని పరిశీలకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.  ఒకవైపు శేషాచలం అడవులలో వైసీపీ ప్రభుత్వ అండదండలతో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే  నడకదారిలో వెళ్లే భక్తులకు రక్షణ చర్యలు తీసుకోకుండా  అసలా దారిలో వెళ్లే భక్తులను భయభ్రాంతులకు గురి చేసి పూర్తిగా అలిపిరి నడకాదారిలో వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులకు క్రియేట్ చేసి, వన్యప్రాణఉల సంచారాన్ని సాకుగా చూపి శేషాచలం అడవుల్లో  క్రూర మృగాలను అడ్డు లేకుండా చేసుకోవడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 మొత్తం మీద  అలిపిరి నడకదారిలో పెద్ద ఎత్తున చిరుతలు పట్టుబడుతుండటం, అయినా వాటి సంచారం కొనసాగుతూనే ఉందని అధికారులు చెబుతుండటం వెనుక మరో కారణమేదో ఉందని.. అందుమే అలిపిరి నడకమార్గం నుంచి  తిరుమల వెళ్లాలన్న ఉద్దేశాన్ని భక్తులలో తొలగించేలా చేయడం కోసమే చిరుతల సంచారం, భక్తులకు మేం భద్రత కల్పించలేం, మీ భద్రత మీరే చూసుకోండంటూ టీటీడీ భక్తులకు కర్రలు పంపిణీ చేస్తోందనీ అంటున్నారు. మరి శేషాచలం అడవులలో ఏం జరుగుతోంది. అక్రమ కార్యకలాపాలేమిటి? వాటిని సాగిస్తున్నవారెవరు వంటి విషయాలు తెలియాలంటే ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు, అదీ కేంద్ర దర్యాప్తు సంస్థ చేత చేయిస్తేనే అసలు వాస్తవాలు బయటపడతాయని పరిశీలకులు అంటున్నారు.