Leading News Portal in Telugu

Mallikarjun Kharge: జీ-20 సమావేశం ముగిసింది.. దేశ సమస్యలపై దృష్టి పెట్టాలి


కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో పోస్ట్ చేస్తూ.., 2024లో మోడీ ప్రభుత్వం నిష్క్రమణకు ప్రజలు మార్గం సుగమం చేయడం ప్రారంభించారని విమర్శించారు. మరోవైపు జీ-20 సమావేశాలు ముగిసాయి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం దేశ సమస్యలపై దృష్టి పెట్టాలని ఖర్గే అన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి కూడా ప్రస్తావించారు. “ఆగస్టులో సాధారణ ప్లేట్ ఫుడ్ ధర 24 శాతం పెరిగింది” అని ట్విట్టర్(X) లో రాసుకొచ్చారు. అంతేకాకుండా.. దేశంలో నిరుద్యోగం 8 శాతానికి చేరుకుందని.. యువత భవిష్యత్తు అంధకారమైందని తెలిపారు.

మోడీ ప్రభుత్వ దుష్పరిపాలన వల్ల అవినీతి వెల్లువలా వచ్చిందని ఖర్గే ఆరోపించారు. కాగ్ అనేక నివేదికల్లో బీజేపీని బట్టబయలు చేసిందని.. జమ్మూకశ్మీర్‌లో రూ.13000 కోట్ల జల్‌జీవన్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అవినీతిని బయటపెట్టినందుకు దళిత ఐఏఎస్‌ అధికారిపై వేధింపులు జరిగాయని ఖర్గే పేర్కొన్నారు. ప్రధాని ప్రాణ స్నేహితుడి దోపిడీ ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చిందన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆర్‌బీఐ ఖజానా నుంచి రూ.3 లక్షల కోట్లను మోడీ ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న ప్రభుత్వ ఒత్తిడిని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వ్యతిరేకించారు. దీంతో ఈ బండారం బయటపడిందని చెప్పారు.

ఇదిలా ఉంటే.. మణిపూర్‌లో మళ్లీ హింస జరిగింది. హిమాచల్‌ప్రదేశ్‌లో విపత్తు సంభవించింది. అయితే అహంకారపూరిత మోడీ ప్రభుత్వం దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించకుండా తప్పించుకుంటుందని ఖర్గే దుయ్యబట్టారు. వీటన్నింటి మధ్య మోడీ నిజాన్ని కప్పిపుచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానీ ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని చెదరగొట్టే సమస్యలకు బదులుగా వాస్తవాన్ని వినాలని, చూడాలని కోరుకుంటున్నారని ఖర్గే తెలిపారు. 2024లో బీజేపీ నిష్క్రమణకు ప్రజలు మార్గం సుగమం చేయడం ప్రారంభించారని మోడీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.