Leading News Portal in Telugu

Asia Cup 2023: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్స్ ఔట్!


Haris Rauf, Naseem Shah to miss Asia Cup 2023: ఆసియా కప్‌ 2023 సూపర్‌ 4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో ఓడి.. బాధలో ఉన్న పాకిస్తాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. పాక్ స్టార్‌ పేసర్లు హ్యారీస్‌ రవూఫ్‌, నసీం షాలు గాయం కారణంగా ఆసియా కప్‌ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు సమాచారం తెలుస్తోంది. సోమవారం భారత్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తుండగా.. వీరిద్దరూ గాయపడ్డారు. ముందుగా రవూఫ్‌.. ఆపై షా గాయపడ్డాడు.

ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన హ్యారీస్‌ రవూఫ్‌.. రిజర్వ్‌ డే రోజు మైదానంలో అడుగుపెట్టలేదు. ఇక నసీం షా సోమవారం గాయపడ్డాడు. వీరిద్దరికి బ్యాకప్‌గా యువ పేసర్లు షానవాజ్ దహానీ, జమాన్ ఖాన్‌లకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తీసుకుంది. వీరు నేడు పాక్‌ జట్టుతో కలవనున్నారు. ఇక పాకిస్తాన్‌ తమ తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్‌ 14న శ్రీలంకతో తలపడనుంది. సూపర్‌ 4లో రెండు మ్యాచులు ఆడిన పాక్.. ఓ దాంట్లో విజయం సాధించి 2 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది.

‘హారీస్‌ రవూఫ్‌, నసీం షాలను మెడికల్‌ ప్యానెల్ పరిశీలిస్తోంది. వారి గాయాలు తీవ్రమైనవి కావు. ప్రపంచకప్‌ 2023ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా వారిని ఆడించి రిస్క్‌ చేయదలుచుకోలేదు. షానవాజ్ దహానీ, జమాన్ ఖాన్‌లకు సిద్దంగా ఉండమని చెప్పాము. ఒక వేళ వీరిద్దరిని భర్తీ చేయాలని అనుకుంటే.. ఏసీసీ అనుమతి తీసుకుంటాం’ అని పీసీబీ అధికారి ఒకరు పేర్కొన్నారు. టీమిండియా మ్యాచులో రవూఫ్‌ 5 ఓవర్లు వేయగా.. షా 9.2 ఓవర్లు బౌలింగ్ చేశాడు.