Leading News Portal in Telugu

Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు..


ఏపీలో వానలు లేక రైతులు వారి పంటలను పండించడానికి నీళ్ల కోసం తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వాతావరణ శాఖ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. మయన్మార్‌ తీరానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న రెండురోజుల్లో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు (ఐఎండీ) వెల్లడించింది. దీని ఫలితంగా రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో అనేక చోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.

అయితే, కోస్తాంధ్రలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని భారత వాతావరణ అధికారులు పేర్కొన్నారు. నిన్న (సోమవారం) ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి వరకు విజయనగరం, కోనసీమ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.

నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగిలిన చోట్ల తేలిక పాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు. మరో 72 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆ పరిసర ప్రాంతాలపై అల్పపీడనం పడుతుందన్నారు.