Leading News Portal in Telugu

Apple Event 2023: నేడే యాపిల్‌ ‘వండర్‌లస్ట్‌’ ఈవెంట్‌.. ఐఫోన్‌ 15 సిరీస్‌ లాంచ్‌! త్వరలోనే భారత్‌కు


iPhone 15 Launch Today in Apple Wanderlust Event: ప్రముఖ టెక్నాలజీ కంపెనీ యాపిల్‌ భారీ ఈవెంట్‌కు సిద్ధమైంది. ఈరోజు ‘వండర్‌లస్ట్‌’ పేరిట అమెరికాలో యాపిల్‌ కంపెనీ ఈవెంట్‌ నిర్వహించనుంది. ఐఫోన్‌ 15 సిరీస్‌తో పాటు యాపిల్‌ వాచ్‌, వాచ్ అల్ట్రా మోడల్స్‌ ఈ ఈవెంట్లో లాంచ్‌ కానున్నాయి. ఈ ఈవెంట్‌లో ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. కాలిఫోర్నియాలోని యాపిల్‌ పార్క్‌లో ‘వండర్‌లస్ట్‌’ ఈవెంట్ నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుంది. యాపిల్‌ యూట్యూబ్‌ ఛానెల్‌, యాపిల్‌.కామ్‌ వెబ్‌సైట్‌, యాపిల్‌ టీవీ ప్లస్, యాపిల్‌ డెవలపర్‌ యాప్స్‌లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.

వండర్‌లస్ట్‌ ఈవెంట్‌లో ఐఫోన్‌ 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను యాపిల్‌ కంపెనీ లాంచ్‌ చేయనుంది. ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, మరియు ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఫోన్స్ రిలీజ్ కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్స్ త్వరలోనే భారత మార్కెట్లో అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. గతంలో మాదిరి కాకుండా 15 సిరీస్ 2-3 వారాల్లో అందుబాటులోకి రానుందట. 15 సిరీస్‌లో లైటనింగ్‌ పోర్ట్‌ బదులు.. యూఎస్‌బీ టైప్‌-సి పోర్టుతో రానుంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌, కర్వ్డ్ డిస్‌ప్లే లాంటి ఫీచర్స్ అదనంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఐఫోన్‌ 15 సిరీస్‌తో పాటు యాపిల్‌ ఐఓఎస్‌ 17, ఐప్యాడ్‌ ఓఎస్‌ 17, మ్యాక్‌ ఓఎస్ 14, టీవీ ఓఎస్‌ 17, వాచ్‌ ఓఎస్‌ 10, మ్యాక్‌ ఓఎస్‌ సోనోమా వంటి ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు సంబంధించి అప్‌డేట్స్‌ గురించి వండర్‌లస్ట్‌ ఈవెంట్‌లో ప్రకటన చేసే అవకాశం ఉంది. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9, యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ అల్ట్రా 9 కూడా లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఇక ఎయిర్‌ పాడ్స్‌ ప్రో యూఎస్‌బీ టైప్‌-సి పోర్టుతో రానుందని సమాచారం. మరికొద్ది గంటలు ఆగితే అన్ని వివరాలు తెలియరానున్నాయి. ఐఫోన్‌ 15 సిరీస్ ధర, ఫీచర్స్, డిస్‌ప్లే ఎలా ఉండబోతున్నాయో నేటి రాత్రి తెలిసిపోనుంది.