Leading News Portal in Telugu

చంద్రబాబు అరెస్టు.. అవినాష్ బెయిలు రద్దు పిటిషన్ విచారణ వాయిదా.. లింకేంటి? | babu arrest avinash bail cancil pition adjourn| link| supreme| sunita| viveka| murder| case


posted on Sep 12, 2023 9:52AM

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. స్వయంగా బెయిలు రద్దు పిటిషన్ దాఖలు చేసిన డాక్టర్ సునీతారెడ్డి విచారణ వాయిదా కోరారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఎ8, కడప ఎంపీ, వైసీపీ నాయకుడు అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.  

అలాగే అవినాష్ బెయిల్ రద్దుకు మద్దతుగా  సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేసిన  సంగతి తెలిసిందే. అయితే డాక్టర్ సునీత అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు రద్దు పిటిషన్ వాయిదా వేయాలని సుప్రీం కోర్టుకు కోరారు. ఔను నిజంగానే సునీత విచారణ వాయిదా కోరారు.  కారణమేమిటో తెలుసా? అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు రద్దు పిటిషన్ లో సునీత తరఫున వాదించాల్సి ఉన్న సిద్ధార్థ లూద్రా.. అందుబాటులో లేకపోవడమే. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. చంద్రబాబును స్కిల్ స్కాంలో అరెస్టు చేయడంతో సిద్ధార్థ లూద్రా ఆయన హౌస్ అరెస్టు, బెయిలు పిటిషన్లను వాదించేందుకు విజయవాడ వెళ్లారు.

విజయవాడ ఏసీబీ కోర్టులో  ఆదివారం సుదీర్ఘ వాదనలు వినిపించారు. సోమవారం కూడా చంద్రబాబు బెయిల్, రిమాండ్ ను హౌస్ రిమాండ్ గా మార్చాలంటూ వేసిన పిటిషన్లపై రోజంతా వాదించారు. బుధవారం కూడా సిద్ధార్థ లూద్రా అదే పనిపై విజయవాడలోనే ఉంటారు. దీంతో అవినాష్ రెడ్డి బెయిలు పిటిషన్ రద్దు కోరుతూ డాక్టర్ సునీత పిటిషన్ పై వాదించేందుకు ఆయన అందుబాటులో  లేరు. దీంతో సునీత స్వయంగా సుప్రీంను విచారణ వాయిదా వేయాల్సిందిగా కోరారు. సుప్రీం అనుమతించి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.  ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకా హత్య కేసు లో అవినాష్ రెడ్డి A8 గా  ఉన్న సంగతి విదితమే.  జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేసు విచారణ జరిగింది.  

తన తండ్రి హత్యకు ప్రధాన సూత్రధారి అవినాష్ రెడ్డి అని కేసు దర్యాప్తుకి సహకరించకుండా తప్పించుకుంటున్నారని తన పిటిషన్‌లో సునీత పేర్కొన్నారు.  అలాగే వివేకా హత్యకు తండ్రీ కొడుకులు భాస్కర్ రెడ్డి , అవినాష్ రెడ్డి కుట్ర చేశారని అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది. రాజకీయ వైరంతోనే వివేకా హత్య జరిగిందని సీబీఐ విస్పష్టంగా పేర్కొంది. గొడ్డలితో నరికి హత్య జరిగితే.. గుండెపోటు అంటూ కట్టుకథ అల్లారని సీబీఐ అఫిడవిట్ లో పేర్కొంది. ఈ హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర ఉందనీ,  ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ వెల్లడించింది. వివేకా హత్యకు అవినాష్ రెడ్డి , భాస్కర్ రెడ్డిలే సూత్రదారులు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని కూడా సీబీఐ పేర్కొంది. హైకోర్టు ఇతర నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందని అనుకున్నారు. కానీ న్యాయవాది లేకపోవడంతో సునీతారెడ్డినే విచారణ వాయిదా కోరుకోవాల్సి వచ్చింది.

దీంతో అవినాష్ రెడ్డి బెయిలు రద్దు పిటిషన్ విచారణ వాయిదా పడేందుకు వ్యూహాత్మకంగానే సరిగ్గా ఆ పిటిషన్ విచారణకు వచ్చే సమయంలో టైం చూసుకుని చంద్రబాబు అరెస్టుకు వైసీపీ సర్కార్ తెరతీసిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద చంద్రబాబు అరెస్టు అవినాష్ రెడ్డి బెయిలు రద్దును కొంత కాలం వాయిదా వేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.