తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా? | telangana assembly elections postpone| ktr| doubt| along|with|general
posted on Sep 12, 2023 4:40PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలు లేవా? జమిలి పేరుతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నాయా అంటే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఔననే అంటున్నారు. తెలంగాణ ఎన్నికలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ అక్టోబర్ 10వ తేదీలోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. అక్టోబర్ 10 లోగా నోటిఫికేషన్ వస్తే అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ లేదా జనవరిలో జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. కానీ పరిస్థితులను చూస్తుంటే అలా వచ్చే నెల 10 లోగా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని ఆయన అన్నారు. తన అంచనా ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు.
ఈ విషయంపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక పోతే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు అంటే 22 వరకూ జరగనున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తరువాత శీతాకల సమావేశాలను నవంబరు మూడు లేదా నాలుగో వారంలో నిర్వహించడం ఆనవాయితీ. అయితే అందుకు భిన్నంగా వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11న ముగిశాయి. అవి ముగిసి నెలన్నర రోజులు గడవక ముందే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడం చర్చనీయాంశమైంది. ఇండియా పేరు మార్పు, జమిలి ఎన్నికలు అజెండాతో ఈ ప్రత్యేక సమావేశాలను కేంద్రం నిర్వహిస్తోందన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
అందుకు అనుగుణంగానే తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 15న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రగతి భవన్ లో జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనునన ఈ సమావేశంలో పార్లమెంట్ ప్రత్యే కమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది. మొత్తం మీద పార్లమంటు ప్రత్యేక సమావేశాల అజెండా ఏమిటన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ప్రత్యేక సమావేశాల అజెండా ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో అజెండా ఎలా ఉండాలో తాను కేంద్రానికి సూచించింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో అజెండా ఏమిటి? కేంద్రం ఏ ఉద్దేశంతో ఈ సమావేశాలు నిర్వహిస్తోందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.