చంద్రబాబు కోసం తొడకొట్టి ముందుకొచ్చిన బాలయ్య | balayya calls for democravy save movement| assure| stand| front| jagan| full| fear
posted on Sep 12, 2023 3:51PM
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డని ఓటమి భయం వెంతడుతోందా? ఇటు లోకేష్, అటు పవన్ కళ్యాణ్, మరో వంక చంద్రబాబు నాయుడు..ముగ్గురూ మూడు దిక్కుల నుంచి ఒకే సారి సమర శంఖం పూరించడంతో జగన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? ఇటు చూస్తే విరుచుకు పడుతున్న విపక్షాలు, అటు చూస్తే పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం, మరో వంక వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మొదలు క్రింది స్థాయి నాయకులవరకు అధికార పార్టీ నాయకుల అవినీతి, అక్రమాలపై ప్రజల్లో వ్యక్త మవుతున్న వ్యతిరేకత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని భయ పెడుతోందా? విజయంపై నమ్మకం పూర్తిగా పోయిందా అంటే రాజకీయ విశ్లేషుకులు అవుననే అంటున్నారు.
అందుకే ఎటూ పాలుపోని ఏమి చేయాలో, ఎలా బయట పడాలో అర్థం కాని జగన్ రెడ్డి తాచెడ్డ కోతి వనమంతా చెరిచింది అన్నట్లుగా ప్రతిపక్ష నేత, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అవినీతి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. స్వయంగా అవినీతి ఊబిలో కూరుకుపోయి, ఎన్నో అవినీతి కేసుల్లో ఏవన్ ముద్దాయిగా ఉండడమే కాకుండా, బెయిల్ మీద కాలం వెళ్ళదీస్తూ కోర్టు అనుమతి లేనిదే దేశం గీత దాట లేని ఏవన్ జగన్ రెడ్డి అందరూ తనలాగే, వర్ధిల్లాలని కోరుకుంటున్నారో ఏమో కానీ, రాజకీయ ప్రత్యర్ధులందరినీ, అదే గాటన కట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే, ఇప్పడు చంద్రబాబు నాయుడు పై కక్ష కట్టి కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నాలుగు పదుల పైబడిన రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారు. జైలుకు పంపారు.
అయితే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేము అన్నట్లుగా చంద్రబాబు నాయుడిని నిర్బందించినంత మాత్రాన తెలుగు దేశం ప్రభంజనాన్ని, పెల్లుబుకుతున్న ప్రజాగ్రహాన్ని అడ్డుకోవాలనుకుంటే అడ్డుకోగల మనుకుంటే, అది జగన్ రెడ్డి, ఆయనగారి పాపాల పరివారం అజ్ఞానం, అవివేకం, అహంకారమే అవుతుంది. ఒక్క చంద్రబాబును నిర్బందిస్తే, న్యాయం కోసం , ధర్మం కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం వంద మంది చంద్రబాబులు పుట్టు కొస్తారు. కాదు.. కాదు పుట్టు కొచ్చారు. నిజం. సినిమాల్లోనే కాదు, రాజకీయ జీవితంలోనూ ప్రత్యర్ధులను దబిడిదిబిడి ఆడించే బాలయ్య మరో మారు తొడ కొట్టారు. చంద్రబాబు అరెస్ట్ తో నైతిక స్థైర్యం కోల్పోయిన క్యాడర్ ను తిరిగి ఛార్జ్ చేసేందుకు బాలయ్య బాబు రె ఢీ అయ్యారు.
చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన బాలయ్య కార్యకర్తలు అధైర్య పడవలసిన అవసరం లేదని … చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని భరోసా ఇచ్చారు. అలాగే, ‘నేనొస్తున్నా.. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపెడదాం’ అన్నారు. ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు అరెస్టుతో కొందరు ప్రాణాలు కొల్పోయారని..ఆ కుటుంబాలను పరామర్శిస్తానన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎవ్వరికీ భయపడనక్కర్లేదన్నారు.
నేను వస్తున్నా.. నేనే ముందుంటా. స్వాతంత్ర్య సమరం మనం చూడలేదు. కానీ గతంలో ఎన్టీఆర్ సర్కార్ ను అప్రజాస్వామికంగా కూలదోసినప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ద్వారా తెలుగోడి సత్తా చూపాం. ఇప్పడు ఆ చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మరోమారు ఆనాటి పౌరుషాన్ని, పౌరుషాగ్నిని చూపుదాం అని పిలుపునిచ్చారు. జగన్ చేసే కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్న బాలయ్య, ఈ నాలుగున్నరేళ్లు అనుభవించిన నరకయాతన చాలు ఇక మార్పు మార్పుకోసం సైనికుల్లా పనిచేయాలని ప్రజలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మొరిగితే పట్టించుకోను.. అతిక్రమిస్తే ఉపేక్షించను అన్నారు. భయపడుతూ కూర్చొంటే ఏపీ సర్వ నాశనం అవుతుందన్నారు. సైనికుల్లా ప్రతి ఒక్కరూ తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు.
అంతే కాదు అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ నేమ్ గా నిలిచిన చంద్రబాబును, అరాచకానికి ప్రతిరూపంగా నిలిచే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, కక్షసాధింపే లక్ష్యంగా అరెస్ట్ చేశారని బాలయ్య అన్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బాలయ్య అన్నారు .స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లేకున్నా కక్ష సాధింపుతోనే కుట్రపన్ని అరెస్టు చేశారన్నారు. జగన్ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ గతంలోనూ ఎన్నో సంక్షోభాలు చూసింది.. అధిగమించింది ఇప్పుడూ, ఓటమి భయంతో, కక్షపూరితంగా జగన్ రెడ్డి సృష్టించిన సంక్షోభాన్ని అధిగమిస్తామంటూ బాలయ్య గర్జించారు.