Leading News Portal in Telugu

Salakatla Brahmotsavam 2023: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రండి.. సీఎం జగన్‌కు టీటీడీ ఆహ్వానం


Salakatla Brahmotsavam 2023: విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మళ్లీ బిజీ అయిపోయారు.. ఈ రోజు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి.. టీటీడీ సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి.. సీఎంకు ఆహ్వానపత్రికతో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. డిప్యూటీ సీఎం, టీటీడీ ఛైర్మన్, ఈవో.. ఇక అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం చేశారు.. కాగా, ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 9 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)

కాగా, ఈ ఏడాది అధిక మాసం కారణంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీటీడీ ప్రకటించింది.. సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా ఈ నెల 18న ధ్వజారోహ‌ణం, 22న గ‌రుడ వాహ‌నం, 23న స్వర్ణర‌థం, 25న ర‌థోత్సవం, 26న చ‌క్రస్నానం, ధ్వజావ‌రోహ‌ణం జ‌రుగ‌నున్నాయి. అయితే న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబ‌రు 19న గ‌రుడ‌వాహ‌నం, అక్టోబ‌రు 22న స్వర్ణర‌థం, అక్టోబ‌ర్‌ 23న చ‌క్రస్నానం నిర్వహించనుంది టీటీడీ.