బాబు అరెస్టుకు నిరసనగా మరో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం! | another save democracy movement| babu| arrest| protest| all| political| parties
posted on Sep 12, 2023 3:29PM
ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం ప్రారంభం కానుందా? చంద్రబాబునాయుడి అరెస్టుతో పార్టీలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా ఒక సమష్టి ఆందోళనకు రంగం సిద్ధమౌతోంది. 1984లో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూలదోసిన సమయంలో ఉవ్వెత్తున ఎగసిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని గుర్తు తెచ్చేలా మరో మహోద్యమానికి బాటలు పడ్డాయా? అంటే పరిశీలకులు అవుననే అంటున్నారు.
స్కిల్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్టుతో ఒక్క సారిగా ఏపీ రాజకీయం వేడెక్కింది. జాతీయ స్థాయిలోనూ పార్టీలకు అతీతంగా అరెస్టుపై ఆందోళన వ్యక్తం అవుతోంది. బీజేపీ సహా అన్ని పార్టీలూ చంద్రబాబు అరెస్టును ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. చంద్రబాబు నాయుడి అరెస్ట్ జగన్ రెడ్డి ప్రభుత్వ కక్ష సాధింపేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆయనను అరెస్టు చేసిన తీరు ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. చంద్రబాబు పాలనలో తప్పు జరిగిందని భావిస్తే విచారణ జరిపించాలని అంతే కానీ అధికారంలో ఉన్నాం కదా? ఏం చేసినా చెల్లిపోతుందన్న ధోరణిలో నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్టులకు తెగబడటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా అడ్డగోలుగా ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసినా ఏసీబీ కోర్టు యాంత్రికంగా రిమాండ్ కు ఆదేశించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ చంద్రబాబు అరెస్టును ఖండించాయి. తెలుగుదేశం పార్టీకి సంఘీభావం ప్రకటించాయి. లోకేష్ ను కలిసి మరీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తెలుగుదేశం పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీజేపీ నాయకుడు లక్ష్మణ్ ఖండించారు. చంద్రబాబు అరెస్టు ప్రభుత్వ కక్షపూరిత విధానానినికి నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణించారు. గతంలో అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదింపిన సందర్భంగా సిద్ధాంత రాద్ధాంతాలను పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలూ ఏకతాటిపైకి వచ్చిన విధంగా చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ పార్టీలన్నీ ఒకే విధంగా స్పందించడం బీజేపీ, కాంగ్రెస్, వంటి పార్టీలు కూడా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించడం, చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించడం చూస్తుంటే.. 1984 నాటి ఉద్యమానికి అంకురార్పణ జరుగుతోందా అనిపించకమానదని అంటున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ఏడెనిమిది నెలల సమయం కూడా లేని ఈ తరుణంలో ఏపీలో ఒక ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి కార్యాచరణ రూపుదిద్దుకుంటోందని అంటున్నారు. చంద్రబాబు అరెస్టుతో వైసీపీని మినహాయిస్తే.. అన్ని పార్టీలూ రోడ్ల మీదకు వచ్చాయి. ఏపీలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నడిరోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. అన్ని పార్టీల నేతలూ చంద్రబాబు అక్రమ అరెస్టును ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటన నుంచి చేసిన మొదటి పని రాష్ట్రంలో శాంతి భద్రతల పై సమీక్షించడం. చంద్రబాబు అరెస్టునకు సంబంధించి ఆయన నోటి వెంట ఒక్కటంటే ఒక్క మాట రాలేదు. అసలు జగన్ దేశంలో లేని సమయంలో చంద్రబాబు అరెస్టు జరిగిన సంగతిని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవలసిన అవసరం ఉంది.
నాడు అంటే 1984లో ఎన్టీఆర్ దేశంలో లేని సమయంలో (ఆయన ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లారు) అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ సర్కార్ ను కూలదోశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబును అప్రజాస్వామికంగా అరెస్టు చేశారు. అప్పడు అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలూ ఖండించాయి. ఎన్టీఆర్ కు సంఘీభావం ప్రకటించాయి. ఇప్పుడు చంద్రబాబును అక్రమంగా అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని కూడా జగన్ కక్షపూరిత చర్య అంటూ జాతీయ స్థాయిలో అన్ని పార్టీలూ ఖండిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రంలో అన్ని వర్గాలూ స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. బంద్ ను భగ్నం చేయడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పినా బెదరకుండా జనం నిలబడ్డారు.
రోడ్ల మీదకు వచ్చిన టీడీపీ శ్రేణులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించారు. పార్టీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. మొత్తం రాష్ట్రాన్నే ఒక జైలుగా మార్చేశారు. అయినా పార్టీ శ్రేణులూ, ప్రజలూ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. చంద్రబాబు అరెస్టునకు నిరసనగా ఆందోళనలు చేస్తున్నారు. రానున్న రోజులలో చంద్రబాబు అరెస్టునకు వ్యతిరేకంగా 1984 ప్రజాస్వామ్యపునరుద్ధరణ ఉద్యమం తరహాలో జగన్ సర్కార్ వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూలదోయడానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమానికి అన్ని తానై ముందుండి నడిపించిన చంద్రబాబు ఇప్పుడు అప్రజాస్వామికంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్టయ్యారు. ఇప్పుడు ఆయన కోసం నాడు ఆయన నడిపించిన మహోద్యమం స్ఫూర్తిగా అన్ని పార్టీలూ ఏకతాటిపైకి వస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.