Leading News Portal in Telugu

Jammu Kashmir: రాజౌరీలో ఎన్‌కౌంటర్‌.. ఓ ఉగ్రవాది హతం


Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. నార్ల గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. అయితే ఈ క్రమంలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. మంగళవారం రాజౌరీ జిల్లాలోని మారుమూల గ్రామంపై సెర్చ్ చేయడానికి వెళ్లిన భద్రతా బలగాల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు.

అంతకుముందు జరిగిన కాల్పుల్లో ఒక సైనికుడు గాయపడినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఉగ్రవాదులను హతమార్చేందుకు అదనపు బలగాలను ఎన్‌కౌంటర్ ప్రదేశానికి తరలించామని అధికారి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పత్రాడ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు సెర్చ్, కార్డన్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని కొంతమందిపై కాల్పులు జరిపారని అధికారి తెలిపారు.

చీకటి పడటంతో నిందితులిద్దరూ పారిపోయారని.. వారి బ్యాక్‌ప్యాక్‌ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని పోలీస్ అధికారి చెప్పారు. అందులో కొన్ని బట్టలు, మరికొన్ని సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. పరారీలో ఉన్న ఉగ్రవాదుల ఆచూకీ కోసం బంబల్, నార్లా, పరిసర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు ముమ్మరం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.