Leading News Portal in Telugu

High Court of Kerala: అశ్లీల వీడియోలు చూడటం వ్యక్తిగత ఇష్టం.. కేరళ హైకోర్టు తీర్పు


అశ్లీల చిత్రాలు లేదా వీడియోలను ఇతరులకు చూపించకుండా ప్రైవేట్‌గా చూడటం చట్ట ప్రకారం నేరం కాదని అది వ్యక్తిగత ఇష్టమని కేరళ హైకోర్టు పేర్కొంది. దానిని నేరంగా పరిగణిస్తే వ్యక్తి గోప్యతకు భంగం వాటిల్లిందని.. అతని వ్యక్తిగత ఎంపికలో జోక్యం చేసుకోవడమేనని తెలిపింది. దీంతో 33 ఏళ్ల యువకుడిపై కేసును హైకోర్టు కొట్టేసింది. 2016లో కేరళ పోలీసులు రోడ్డు పక్కన మొబైల్‌లో అశ్లీల వీడియో చూస్తున్న యువకుడిని పట్టుకుని అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 292 కింద కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ఎఫ్‌ఐఆర్‌తోపాటు ప్రస్తుతం కొనసాగుతున్న కోర్టు విచారణలను రద్దు చేయాలని నిందితుడు హైకోర్టులో పిటిషన్‌ వేశాడు.

ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఏమందంటే.. అశ్లీల కంటెంట్ శతాబ్దాలుగా ఆచరణలో ఉందని.. కొత్త డిజిటల్ ఇప్పటి యుగం పిల్లలకు దీన్ని మరింత అందుబాటులోకి తెచ్చిందని పేర్కొంది. ఒక వ్యక్తి తన ప్రైవేట్ సమయంలో ఇతరులకు చూపించకుండా అశ్లీల వీడియోలను చూస్తే నేరంగా పరిగణిస్తారా అని కోర్టు ప్రశ్నించింది. ఏ కోర్టు దీనిని నేరంగా ప్రకటించదని.. ఎందుకంటే ఇది అతని వ్యక్తిగత ఎంపిక అని పేర్కొంది. అంతేకాకుండా అలాంటి విషయంలో జోక్యం చేసుకోవడం అతని గోప్యతలో జోక్యం చేసుకోవడంతో సమానమని. నిందితుడు చూపించినట్లు ఎటువంటి ఆరోపణ లేదని బెంచ్ పేర్కొంది. మరోవైపు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 292 కింద ఎలాంటి నేరం జరగలేదని.. ఈ కేసుకు సంబంధించి మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న అన్ని విచారణలను రద్దు చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.

ఇదిలా ఉంటే.. పిల్లలను సంతోషపెట్టడానికి ఇంటర్నెట్ ఉన్న మొబైల్ ఫోన్‌లను పిల్లలకు ఇవ్వవద్దని జస్టిస్ కున్హికృష్ణన్ తల్లిదండ్రులను హెచ్చరించారు. దీని వెనుక ఉన్న ప్రమాదం గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాలని ఆయన అన్నారు. పిల్లలు వారి పర్యవేక్షణలో సమాచార వీడియోలను చూడటానికి అనుమతించాలి.. కానీ మైనర్ పిల్లలకు వారిని సంతోషపెట్టడానికి మొబైల్ ఫోన్‌లను ఎప్పుడూ వారికి ఇవ్వకూడదని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని మొబైల్స్‌లో అసభ్యకర వీడియోలు దొరుకుతున్నాయని జస్టిస్ కున్హికృష్ణన్ అన్నారు. మైనర్ పిల్లలు అసభ్యకరమైన వీడియోలు చూస్తే.. అది చాలా విపరీతమైన పరిణామాలను కలిగిస్తుందన్నారు. సెలవుల్లో పిల్లలు క్రికెట్, ఫుట్‌బాల్, ఇతర ఆటలకు ప్రాధాన్యతనిచ్చేలా చూడాలని జస్టిస్ కోరారు.