Leading News Portal in Telugu

ఎన్నికలపై తెలంగాణలో కన్ఫ్యూజన్.. పార్టీలలో అయోమయం | confusion on elections in telangana| president| rule| candidates| list| wait| see


posted on Sep 13, 2023 2:01PM

ఎన్నికల సమయం ముంచుకువస్తున్నా.. తెలంగాణలో మాత్రం రాజకీయ సర్కిల్స్ లోనే కాదు.. పార్టీల్లోనూ, నేతల్లోనూ కూడా ఒక కన్ఫ్యూజన్, ఒక గందరగోళం నెలకొని ఉంది. ఊరికి ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించేసిన అధికార బీఆర్ఎస్ తొందరపాటుతో రాజకీయంగా తప్పుటడుగు వేశానా అన్న మథనంలో ఉంటే.. అధికారం కోసం అన్ని విధాలుగా సమాయత్తమౌతున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల విషయంలో వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది.

ఇక రాష్ట్రంలో అధకారమే ధ్యేయమంటూ దూకుడుగా కదులు తున్న బీజేపీలో కూడా హఠాత్తుగా అనూహ్యంగా స్తబ్దత నెలకొంది. ఇందుకు కారణాలేమిటని ఆలోచిస్తూ తలలు బద్దలు కొట్టుకోవలసిన అవసరం ఏమీ లేదు. కేంద్రం జమిలి ఎన్నికలవైపు మొగ్గు చూపుతోందని వస్తున్న వార్తల కారణంగానే.. రాష్ట్రంలో రాజకీయంగా ఈ అనిశ్చితి వాతావరణం ఏర్పడిందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇంతకీ జమిలి చర్చ కారణంగా అన్ని రాజకీయ పార్టీలలోనూ కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ లో జరుగుతాయా, లేక సార్వత్రిక ఎన్నికలతో కలిపి వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలలో జరిగే అవకాశాలు ఉన్నాయా అన్న అనుమానాలే.

 కేంద్రం జమిలికే మొగ్గు చూపి.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కలిసి వచ్చే రాష్ట్రాలలో కూడా ముందస్తుకు తెరతీసి పనిలో పనిగా సార్వత్రిక ఎన్నికలను కూడా ముందుకు జరిపేస్తుందా? లేక షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాలలో ఎన్నికలను వాయిదా వేసి సార్వత్రిక ఎన్నికలతో పాటు జరుపుతుందా అన్న సందేహాలు రాజకీయ పార్టీలలోనే కాదు, పరిశీలకులు, విశ్లేషకుల్లో కూడా బలంగా వ్యక్తం అవుతున్నాయి.   ఈ సందేహాలు, అనుమానాలు నివృత్తి కావాలంటే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వరకూ ఎదురు చూడాల్సిందే.