Parliament Session: సెప్టెంబర్ 18-22 వరకు ఐదు రోజుల పాటు కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చింది. సమావేశాలకు ఒక రోజు ముందు సెప్టెంబర్ 17న ఆల్ పార్టీ మీట్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు సమావేశం ఎజెండాను కేంద్రం గోప్యంగా ఉంచింది. ఎవరికీ చెప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై ప్రధాని మోడీకి సోనియాగాాంధీ లేఖ రాశారు.
సోమవారం ఆల్ పార్టీ మీటింగ్ లో సమావేశాల ఎజెండా తెలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 19న వినాయక చతుర్థి రోజున కొత్త పార్లమెంట్ లోకి సభ మారబోతోంది. మరోవైపు శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలు వినాయక చవితి రోజున పార్లమెంట్ సమావేశాలు ఏంటని ప్రశ్నిస్తున్నాయి.
అయితే ఈ సమావేశాల్లో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’, ఇండియా-భారత్ పేరు మార్పు, ఉమ్మడి పౌరస్మృతి వంటి అంశాలు వాటికి సంబంధించిన బిల్లులను కేంద్ర సభ ముందుకు తీసుకురాబోతోందనే ఊహాగానాలు వెలువుడున్నాయి. ఇటీవల జీ20 సమావేశాల్లో దేశాధినేతల విందు ఆహ్వాన నోట్ లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉండటం, ప్రధాని జీ20 నేమ్ ప్లేట్ పై దశం పేరు భారత్ గా ఉండటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు ద్రవ్యోల్భణం, చైనా అంశం, నిరుద్యోగం, మణిపూర్ సమస్యలను లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నాయి.