Leading News Portal in Telugu

ఐయాం విత్ బాబు అంటూ హైదరాబాద్ లో కదంతొక్కిన ఐటీ ఉద్యోగులు | it employees agitate against babu arrest| iam| with| babu| gatchibowli| vipro


posted on Sep 13, 2023 4:54PM

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు  రాష్ట్రం, ప్రాంతం అన్న తేడా లేకుండా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.  హైదరాబాద్, బెంగళూరులో ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. ఐయామ్ విత్ బాబు అంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్లపై బైఠాయిస్తున్నారు.

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బుధవారం (సెప్టెంబర్ 13)  హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు కదం తొక్కారు. గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ చంద్రబాబు అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టిన ఐటీ ఉద్యోగుల నినాదాలతో మార్మోగింది. చంద్రబాబు అరెస్టు అన్యాయం, అక్రమం, అధర్మం అంటూ వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ నినదించారు. దురుద్దేశపూర్వకంగా చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. 

చంద్రబాబు విజన్ వల్లే తాను మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నత స్థాయి జీవితాన్ని గడపగలుగుతున్నామని, ఆయన మాత్రం జైల్లో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిజన్ బ్యాచ్ విజన్ బ్యాచ్ ను టార్గెట్ చేసిందన్నారు.  ఐయాం విత్ సీబీఎన్ వంటి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. జగన్ కు ఐటీ ఉద్యోగులు బుద్ధి చెపుతారని హెచ్చరించారు. కాగా ఐటీ ఉద్యోగుల ఆందోళనతో ఆ  ప్రాంతానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.